దాచిన ప్రతిదీ దోచినట్టే అనుకోవడం కరెక్టేనా? ఇప్పుడు ఏపీ సర్కారును విమర్శించే వారికి కూడా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వం రకరకాల అంశాలపై విడుదల చేసే జీవోలు సాధారణంగా ఓపెన్ డాక్యుమెంట్లుగానే ఉంటాయి. ఇవి అందరు ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి. కానీ కొన్ని జీవోలు రహస్యాలుగా ఉండడం కద్దు. ఇలాంటి వాటి గురించే ఇప్పుడు ఏపీ సర్కారు విషయంలో రగడ సాగుతోంది. ఏదో ఒక రకంగా సర్కారును ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కొన్ని పార్టీలు వ్యవహరించడం రివాజే కాగా.. ఈ వైఖరి సమజసం కాదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరాల పాలనలో దాదాపు 800 రహస్య జీవోలను ప్రజల దృష్టికి తీసుకురాకుండా దాచి ఉంచిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ రహస్య జీవోలు టీడీపీ కార్యకర్తలకు, ప్రభుత్వంలోని వారికి, పారిశ్రామికులకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి ఉద్దేశించినవేనని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. రహస్య జీవోల పరమార్థం దేవుడెరుగు కానీ, ఈ ఆరోపణలు మరొక కోణాన్ని ఎత్తి చూపుతున్నాయి. 

ప్రభుత్వానికి తాను జారీ చేసే జీవోలను ఉపసంహరించే హక్కుతో పాటు వాటిని గోప్యంగా కూడా ఉంచే హక్కు ఉంటుందనే విషయం కూడా ప్రతిపక్షాలకు తెలియదా అంటూ పాలనా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత భద్రతకు సంబంధించిన, రాష్ట్రానికి తరలివచ్చే పెట్టుబడులకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని, ఈ కోణంలో జారీ చేసే ఆదేశాలను రహస్యంగా ఉంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వీరు చెబుతున్నారు. 

సాధారణంగా మదుపుదారులకు అందించే రాయితీలకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం వెనువెంటనే ప్రజల ముందుకు తీసుకువస్తుంటుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి, మదుపుదారులకు గాలం వేయడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర పోటీ నెలకొంటున్న నేపధ్యంలో అన్ని ప్రభుత్వాలు మదుపుదారులకు తాము ఇవ్వబోతున్న రాయితీలను బహిరంగ పర్చకుండా దాచి ఉంచుతున్నాయి. సింగపూర్, జపాన్ చైనా తదితర దేశాలను నుంచి పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయంటూ ఏపీ సర్కారు అదే పనిగా ఊదరగొట్టేస్తోంది. అయితే వారికి ఇస్తున్న రాయితీలు ఏమిటో మాత్రం వెల్లడించడం లేదు. ఇదివరకటి ప్రభుత్వాలు స్వదేశీ శక్తులకు సెజ్ ల పేరుతో భూముల్ని దోచిపెడితే.. ఇప్పుడు చంద్రబాబు నిబంధనల్ని తుంగలో తొక్కి, దాచిన జీవోల్లో రాయితీల్ని కుక్కి.. విదేశీ పెట్టుబడి దార్లకు ఏపీ సంపదను దోచిపెడతారా అని అనుమానాలు పెచ్చరిల్లుతున్నాయి. 


ఈ విషయం తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై గుడ్డిగా బురదజల్లడం కొనసాగిస్తే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికే అది దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకుల మధ్య ఉండే వైషమ్యం రాజకీయాల వరకే పరిమితం అయితే బాగుంటుందని కానీ రాష్ట్ర భవిష్యత్తుకు, అభివృద్ధికి చెందిన విషయాల్లో కూడా రాజకీయాలు దూరితే అది అందరికీ నష్టదాయకమేనని వీరు విచారం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: