ఆంధ్రా సర్కారు పాలనలో కుల వివక్ష ఎక్కువైందా.. ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారా.. ఏదో ఒకటి, రెండు చోట్ల కాకుండా అన్ని రంగాల్లోనూ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారా.. కావాలని కొన్ని సామాజిక వర్గాలపై ఉక్కుపాదం మోపుతున్నారా.. ఇలాంటి సందేహాలు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సర్కారుపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. 

చంద్రబాబు గతంలో 9 ఏళ్లు పాలించినా ఎప్పుడూ ఈ స్థాయిలో ఆరోపణలు రాలేదు. కానీ ఈసారి మాత్రం తొలి రెండేళ్లలోనే ఈ ఆరోపణలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్డి అధికారులకు సరైన పోస్టింగులు ఇవ్వడం లేదని వైసీపీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే  ఎస్సీ మోహన్ రెడ్డి ఆరోపించారు. పోలీస్ వ్యవస్థలో కూడా రెడ్డి కులస్తులను తొక్కేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

లేటెస్టుగా..ఇప్పుడు మరోనేత కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు భూముల కేటాయింపులలో తన సామాజికవర్గం వారకే ప్రాధాన్యం ఇస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపించింది. ఇటీవల చంద్రబాబు సర్కారు చేసిన భూ కేటాయింపులే అందుకు ఉదాహరణ అని చెబుతోంది. ఇటీవల చంద్రబాబు విశాఖ, అమరావతి ప్రాంతం, తిరుపతిల్లో భూ కేటాయింపులు జరిపారు. 

విశాఖలో లోకేశ్ స్నేహితుడి కంపెనీకి, బాలకృష్ణ వియ్యంకుడి తరపు వారికి భూములు కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. ఇక రాజధాని ప్రాంతంలో జయభేరి సంస్థ అధినేత మురళీమోహన్ కు భూములు కట్టబెట్టారని వార్తలు వచ్చాయి. తిరుపతిలో ఎంపీ గల్లా జయదేవ్, ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణకు భూములు కేటాయించారు. వీరంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారేనని.. భూపందేరంలో కూడా చంద్రబాబు తన కులం వారికే పెద్ద పీట వేస్తున్నారని మండిపడుతున్నారు వైసీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: