నందమూరి వారసులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ నలుమూలలా వందల ఎకరాల భూమిని అప్పనంగా, అతి తక్కువ ధరలకే కట్టబెడుతున్నట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేవదీస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలంటూ వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాలు విసరటం సంచలనం కలిగించింది.

 

ఉత్తరాంధ్రలో ఎకరం భూమి 10 కోట్లు పలుకుతున్న చోట చంద్రబాబు ప్రభుత్వం 50 లక్షల వద్ద ధరను తగ్గించి మరీ 50 ఎకరాలను బంధువులకు కట్టబెట్టడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పైగా రాజధాని ప్రాంతంలోనే ఎకరం 50 లక్షలు పలికేచోట 490 ఎకరాల భూమిని ఎకరానికి కేవలం లక్ష రూపాయల ధర నిర్ణయించి నందమూరు బాలకృష్ణ బంధువులకు తెలుగుదేశం ప్రభుత్వం అప్పగించడం రాజధాని ప్రాంతంలో భూములు పొగొట్టుకున్న రైతులను నిశ్చేష్ట్యులను చేసింది.

 

చంద్రబాబు ఆశ్రిత పక్షపాతం రాయల సీమ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఎకరా నాలుగు కోట్లు పలికే చోట కేవలం 22 లక్షల రూపాయల ధరతో మొత్తం 22 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇక్కడ కూడా ఆశ్రితులకు పంచిపెట్టినట్లు వైకాపా ఎమ్మెల్యే ప్రకటించిన వార్త నిప్పులాంటి బాబు నిజాయితీని అద్దంలో ప్రతిబింబిస్తోందనీ, వెంటనే బాబు ఈ అంశంపై సమాధానమివ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భూకేటాయింపుల విషయంలో చంద్రబాబునాయుడు సర్కారు అనుసరిస్తున్న విధానాలు తొలినుంచి తీవ్రమైన విమర్శలకు లోనవుతున్నాయి. అయిన వారికి ఇచ్చమొచ్చనట్లుగా దోచిపెట్టడానికే చంద్రబాబు సర్కారు ప్రాధాన్యం యిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు సర్కారు కొమ్ము కాస్తూ ఉండే ఒక మీడియా సంస్థకు కూడా.. అప్పనంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భూములు కేటాయించేయడానికి కూడా రంగం సిద్ధమవుతున్నదని.. ఇందులో కొన్నిచోట్ల కేటాయింపులు పూర్తయ్యాయని.. మరికొన్ని జరగాల్సి ఉన్నదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈలెక్కన రాష్ట్రంలో మిగులు భూములు అంటూ తన ఏలుబడి పూర్తయ్యేసరికి చంద్రబాబు ఏమీ లేకుండా చేసేస్తారేమోనని అంతా అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: