కేసీఆర్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే వరంగల్‌ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో తనకు ఎంపీగా విజయాన్ని అందిస్తున్నారని తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలకు జనం ఎంత గొప్పగా ఆదరణ లభిస్తున్నదనడానికి ఇది నిదర్శనం అని దయాకర్‌ పేర్కొన్నారు. 


పసునూరి దయాకర్‌ .. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న నేతగా.. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తగా, ఆ విగ్రహాలను తెలంగాణ పల్లెలకు సరఫరాచేసిన నాయకుడిగా కీర్తి గడించారు. ఆయన తొలినుంచి తెరాసలో పనిచేస్తున్నప్పటికీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. రకరకాల కాంబినేషన్ల నేపథ్యంలో ఆయనకు టిక్కెట్‌ దక్కలేదు. అయినప్పటికీ కేసీఆర్‌.. దయాకర్‌ సేవలను గుర్తుంచుకుని.. ఎంపీస్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. తొలుత పార్టీ తరఫున మరో అభ్యర్థిని దించాలనుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో కాంబినేషన్లు మారి.. అభ్యర్థిత్వం దయాకర్‌ను వరించింది. 


ఆయనకు అదృష్టం కలిసివచ్చింది. అభ్యర్థిని ముందుగా ఖరారు చేయడం మాత్రమే కాకుండా.. ప్రచారం లో కూడా తెరాస ముందుగానే రంగప్రవేశం చేసింది. ఉప ఎన్నిక గనుక ఆషామాషీగా తీసుకోకుండా.. పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. అభ్యర్థిని ప్రకటించాక తొలిరోజునుంచే మంత్రలను సెగ్మెంట్లకు ఇన్చార్జులుగా నియమించి కార్యకర్తలతో సమావేశాలు పెట్టించి.. వారిని సమరానికి సిద్ధం చేశారు. మొత్తానికి ఈ ప్రయత్నాలన్నీ ఫలించాయి. 


దయాకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీగా తనను గెలిపించిన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, కేసీఆర్‌ కలగంటున్న బంగారు తెలంగాణ సాధనలో తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: