తెలంగాణలో అడుగడుగునా ఎదురు దెబ్బతింటున్న తెరాస అధినేత చంద్రశేఖర రావు ఈ మధ్య నోటికి పని తగ్గించి మౌనం పాటిస్తూ తన పని తాను చేసుకుపోతున్నట్లు కనిపిస్తుంటే తెరాస నేతలందరి దండకాలను కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దత్తకు తీసుకున్నట్లుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సమస్యలు ఏ స్థాయిలో ఉంటున్నాయో రోజువారీ అనుభవంలో నిత్యం చూస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల, నాయని తదితరులు ఇప్పటికే మాటలు మాని సైలెంటుగా పని చేసుకుపోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది ఒకందుకు మంచిదే లెమ్మని ప్రజలు కూడా స్థిమితంగా ఉంటున్న సమయంలో తెరాస నాయకుల తిట్లను, దండకాలను కవిత టోకున అరువు తీసుకుంటున్నట్లుందని పరిశీలకులు చెబుతున్నారు.

 

వాస్తవానికి, తిట్లకు, దూషణలకు, నీలాపనిందలకు, యుక్తాయుక్త విచక్షణ ఉండదు. వాటి ప్రభావంలో పడిన విద్యావంతురాలైన కవితకు కూడా విచక్షణ మరిచి మాట్లాడటం కొత్తగా అలవాటవుతున్నట్లుంది. రెండురోజులకు ముందు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపైకి ఒంటికాలి మీద లేచి ఎగిరిన కవిత ఇప్పుడు సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీదకే బాణం గురిపెట్టారు. గురిపెట్టడం కాదు ఇష్టం వచ్చినట్లు మాటలతో మోదీని ఏకి పడేశారు.

 

కేంద్రంలో మంత్రి పదవిని ఆశించి గతంలో భంగపడిన కవిత అప్పటినుంచి అవకాశం దొరికినప్పుడల్లా మోదీపై విసుర్లు విసురుతూనే ఉన్నారు. ఇక బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చెందిన తర్వాత కవిత నోటికి పట్టపగ్గాలు లేకుండా పోయాయనే చెప్పాలి. ఆమె బాధేమిటి అంటే కేంద్రం ఆంద్రప్రదేశ్‌ను కన్నతల్లిలా చూసుకుంటోందట. అదే సమయంలో తెలంగాణ పట్ల కేంద్రం సవితి తల్లిలా వ్యవహరిస్తోందట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిధులన్నింటినీ ఆంధ్రకే దోచిపెడుతున్నారన్నది ఆమె ఆరోపణ.

 

పైగా విభజన బిల్లులో తెలంగాణకు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని కవిత ప్రశ్నించడం వింతగా ఉంది.  తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు సరిగ్గా ఇదే అంశాన్ని పట్టుకుని కవితను నిలదీశారు. మోదీ తనకు కేంద్ర మంత్రి పదవిని ఇవ్వలేదని ఆ అక్కసునంతా ఆమె ఏపీమీదికి, ఆంధ్రోళ్లమీదికి మళ్లించడం ఏమిటి అని గాలి ప్రశ్నించారు. ఏపీకి కేంద్రం నిధుల వెల్లువను పంపిస్తోందంటూ కవిత చేసిన ఆరోపణ నిరాధారమని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వాగ్దానం చేసినట్లుగా ఏపీకి విభజన ఫలితంగా ఏర్పడిన లోటు బడ్జెట్‌నే ఇంతవరకు కేంద్రం పూరించలేదని, ఇక ఏపీకి మరిన్ని నిధులను కేంద్రం ఎక్కడ చూపించిందో చూపాలని గాలి కవితను నిలదీశారు. 

 

పైగా తెలంగాణ అదనపు మిగులు ఉన్న రాష్ట్రమని కవిత తండ్రి కె. చంద్రశేఖరరావు గర్వంగా పేర్కొన్నారని అలాంటప్పుడు ఏపీ లోటు బడ్జెట్‌పై కవిత అంతగా గొంతు చించుకోవలసిన అవసరం ఏమిటని గాలి ప్రశ్నించారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలో అర్థం కావడంలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప ఏమీ అవసరంలేదని చెప్పినవారు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేయడమేంటి? ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము కూడా పోరాడతామని విభజన సమయంలో తెలంగాణ నాయకులు చెప్పారు. అది మర్చిపోయి తెలంగాణకు  ప్రత్యేక హోదా డిమాండ్‌ చేయడమేంటి? అన్న ముద్దు ప్రశ్నకు కవితమ్మే సమాధానం చెప్పాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: