వరంగల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ  ఘన విజయం సాధించింది. వరంగల్ లో మొదటి నుంచి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అధికార పార్టీ ఇప్పుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. సమీప  కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 4,59,092 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు.

 టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు 6,15, 403 ఓట్లు,  కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,56,315 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు 1,30,178 ఓట్లు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యాప్రకాష్‌కు 23,352 ఓట్లు చ్చాయి. కాంగ్రెస్‌, బీజేపీ, వైకాపా, వామపక్ష అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు టీఆర్ఎస్ విజయం మరో సంచలనానికి నాంది పలికింది. దేశంలో ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఏడో వ్యక్తిగా ఘనతకెక్కారు. 


టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు


భారత దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుపొంది అభ్యర్థులు వీరే..!

ప్రీతమ్ ముండే (బీజేపీ) :  మహారాష్ట్రలోని బీద్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే 6.92 లక్షల ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం.

అనిల్ బసు (సీపీఎం) :  2004లో పశ్చిమబెంగాల్లోని అరమ్గఢ్ నియోజకవర్గం నుంచి అనిల్ బసు 5.92 లక్షల మెజార్టీతో గెలుపొందారు.
పీవీ నరసింహారావు (కాంగ్రెస్) :  1991లో నంద్యాల నుంచి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు 5.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నరేంద్ర మోదీ (బీజేపీ) :  2014 ఎన్నికల్లో గుజరాత్లోని వడోదర నుంచి నరేంద్ర మోదీ 5.7 లక్షల ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి :  2011లో కడప లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రాంవిలాస్ పాశ్వాన్ :  1989లో ఉత్తరప్రదేశ్లోని హజీపూర్ నుంచి రాం విలాస్ పాశ్వాన్ (జనతా దళ్) 5.04 లక్షల మెజార్టీతో నెగ్గారు.
పసునూరి దయాకర్ :  వరంగల్ ఉప ఎన్నికలో  టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4.59 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: