వరంగల్‌ విజయాన్ని పురస్కరించుకుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రెస్‌మీట్‌ నిర్వహించిన కేసీఆర్‌ తన ప్రభుత్వం పట్ల, పాలన పట్ల ప్రతిపక్షాలు అసహనంతో వేగిపోతున్నాయని.. అర్థం పర్థంలేని విమర్శలతో అసలు పరిపాలన నిర్ణయాలు సజావుగా సాగడానికి కూడా వీల్లేకుండా అడ్డు పడుతున్నాయని విమర్శించారు. ప్రధానంగా తెలంగాణకు నీటి వనరుల విషయంలో గత ప్రభుత్వాల్లోని పాలకులు చాలా అన్యాయం చేశారంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఆంధ్రా పాలకులు విసిరేసిన ముష్టి పదవులకు ఆశపడి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా.. మంత్రిపదవులు పుచ్చుకుని.. రాష్ట్రానికి న్యాయం జరిగేలా ప్రయత్నించలేకపోయారని ఎద్దేవా చేశారు. 


''నీళ్ల విషయంలో మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించడానికి పునాది రాయి వేసే పనిని ప్రజలు మాకు అప్పగించారు. పనుల్లో ఆరునెలలు ఆలస్యం అయినా పర్లేదు గానీ.. తప్పు జరగకుండా చూడాలని పాటుపడుతున్నాం. తెలంగాణకు శాశ్వతంగా కరవును దూరం చేయడానికి చూస్తున్నాం. ఆంధ్రా ప్రాంత ముఖ్యమంత్రులు తెలంగాణ నీళ్లిచ్చే పథకాలు పెట్టలేదు. ఆంధ్రాప్రాంత ముఖ్యమంత్రులు ఉద్దేశపూర్వకం అన్యాయం చేస్తూ వచ్చారు.'' అని అన్నారు. 


పాత ప్రభుత్వాల్లో నాయకులు తెలంగాణ ప్రాంతానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని అంటూ.. ఒక్కొక్క ప్రాజెక్టు వారీగా గతంలో జరిగిన నష్టం ఎలాంటిదో ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఏయే ప్రాజెక్టుల ద్వారా ఎంతెంత ఆయకట్టుకు నీళ్లు అందించే అవకాశం ఉన్నదో ఆయన వివరించారు. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం డిజైన్లు మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్ని కేసీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. 


డిజైన్‌ మార్పు వంటి వ్యవహారాలను కూడా వ్యతిరేకిస్తూ.. అర్థం పర్థం లేని ఆందోళనలు కొనసాగిస్తూ.. కాంగ్రెను నాయకులు ప్రభుత్వాన్ని ముందుకు సాగనివ్వడం లేదని కేసీఆర్‌ అన్నారు. ఇలాంటి అసహనం వారికి తగదని.. వారందరికీ బుద్ధి చెప్పేలా ప్రజలు తీర్పు చెప్పారని అన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో సర్కారు చాలా క్లారిటీతో ఉన్నదని, తెలంగాణ రైతాంగానికి ముందు ముందు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలానే పథకాలు చేపడుతున్నాం అని అన్నారు. ఇంటింటికీ నల్లాను కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్నామన్నారు. ఇళ్లలో బిగించే కొళాయిలను కూడా.. ప్రభుత్వమే సరఫరా చేస్తుందని కూడా కేసీఆర్‌ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: