బాక్సైట్ తవ్వకాలకు అనుమతుల నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటుతున్నాయి. బాక్సైట్ జోలికి వస్తే కబడ్డార్ అంటూ ఏజెన్సీలో నినాదాలు దద్దరిల్లుతున్నాయి. చింతపల్లి ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 97 నిజంగానే  తెలుగుదేశం ఉట్టి ముంచనున్నట్లు సంకేతాలు కనబడుతున్నాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద చేరిన వందలాదిమంది గిరిజనులు ప్రభుత్వ మొండి వైఖరిపై తీవ్ర నిరసన తెలియజేశారు. అధికారంలో లేనప్పుడు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు అధికారం సిద్ధించగానే బాక్సైట్ తవ్వకాలు చేపడతామంటూ జీవో జారీ చేయడం పట్ల గిరిజనులు మండిపడ్డారు. పైగా జీవో 97 సాక్షాత్తూ గవర్నర్ ఆమోదం పొంది వచ్చినప్పటికీ అది గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి ఏమాత్రం తెలియకుండా వచ్చిందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమని గిరిజనులు వ్యాఖ్యానించారు.

 

కాగా, గిరిజన చట్టాలపై మంత్రి అయ్యన్న మతిలేకుండా మాట్లాడుతున్న మాటలు గిరిజనులును మరింతగా మండిస్తున్నాయి. ఏపీలో 1/70 చట్టం  ప్రకారం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మైనింగ్ తవ్వితే లేని అభ్యంతరం ఇక్కడెందుకు వస్తుందో చెప్పాలని మంత్రి అడ్డగోలు వాదనలు చేయడంతో గిరిజనులకు చిర్రెత్తిపోయింది. పైగా  బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా నిద్రాహారాలు మాని ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే బాక్సైట్ తవ్వొద్దని గిరిజనులెవరూ చెప్పడం లేదని, కొంతమంది నాయకులే వారిని రెచ్చగొడుతున్నారని  అధికార పార్టీ నేతలు మాట్లాడుతుండటం గిరిజనులలో ప్రభుత్వ వ్యతిరేకతను మరింతగా పెంచుతోంది.

 

అనేక సంస్థలు కోర్టుకెల్లి 1/70 చట్టం, పీసా, పర్యావరణ చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి చట్టాలకు అనుకూలంగా తీర్పులు తెస్తే వాటన్నింటినీ తుంగలో తొక్కి బాక్సైట్ తవ్వకాలు చేపట్టడానికి ప్రభుత్వం మొండిగా ముందుకు అడుగేస్తుండటంతో ఏజెన్సీ గిరిజనులు అటో ఇటో తేల్చుకోవాలన్నింత కసిని ప్రదర్సిస్తున్నారు. ఏజెన్సీలోని గిరిజన సంఘాలన్నీ ఐక్యమై సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేయడంతో తెలుగుదేశం పార్టీకి కంపరమెత్తిందనే చెప్పాలి. ఇప్పటికే పలు ఎన్నికల్లో ఏజెన్సీలో డిపాజిట్లు పోగొట్టుకున్న తెదేపా నేతలు ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ సమాధి అవుతున్న వైనం అవగతమవుతూ ఉంది. బాక్సైట్‌ తవ్వకాలను అటు గిరజనులు, ఇటు మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ఏజెన్సీలో ఉనికిని కోల్పోవడానికి ఎక్కువ రోజులు పట్టదని అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: