ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దురదృష్టం వెంటాడుతూనే ఉన్నట్లుంది. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు పాలనలో తొమ్మిదేళ్లపాటు ధాతు కరువును చవిచూసిన సీమాంధ్రప్రాంతం ఇప్పుడు మరో దురవస్థను ఎదుర్కొంటోంది. రాయలసీమలో ఇటీవల చంద్రబాబు అడుగుపెట్టిందే తడవుగా వర్షధారలు ముంచెత్తడంతో బాబుపై జనంలో ఉన్న మచ్చ ఇక తొలగినట్లేనని, కరువు తీరినట్లేనని జనం నిజంగానే నమ్మేశారు. మీడియా కూడా బాబు వెళ్లిన తర్వాత సీమలో కురిసిన వర్షాలపై ప్రత్యేక కథనాలు వండివార్చాయి.

 

కానీ రోజులు గడిచేకొద్దీ చంద్రబాబు అడుగుపెట్టిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు గత 50 ఏళ్ల నుంచి ఎన్నడూ లేనంతగా వర్షం బారినపడి తడిసి ముద్దయిపోయాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీమలోని నదులు, వాగులు, వంకలు, చెరువుల కట్టలు తెగి ఊళ్లకు ఊళ్లను ముంచెత్తాయి. పంటపొలాలు నీటమునిగి చెరువులను తలపించడం ఒకెత్తు కాగా, వేలాది మంది నిరాశ్రయులు కావడం, లక్షల ఎకరాల్లోని పంట నాశనం కావడం వెంటవెంటనే జరిగిపోయింది.

 

జిల్లాలవారీగా చూసుకుంటే ఒక సీజన్‌ మొత్తంలో నెల్లూరులో పడే సగటు వర్షం 500 మిల్లీ మీటర్లుగా వాతావరణ శాఖ అంచనాలు తెలుపుతుండగా కేవలం 10 రోజుల్లోనే 740.4 మి.మీ వర్షం జిల్లాను ముంచెత్తింది.  రాయలసీమ జిల్లాల్లో 50 ఏళ్లుగా జనం కనీవినీ ఎరుగనంత వర్షం కుమ్మరించిన నేపథ్యంలో కరువుసీమ చిత్తడిచిత్తడిగా మారిపోయింది. 20 ఏళ్లుగా నిండని చెరువులు, డ్యామ్‌లు నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. తిరుపతి వంటి పట్టణంలో జనం వీధుల్లోకి రావాలంటే భయపడిపోయిన ఉదంతం ఇంతకుముందెన్నడూ లేదు. తిరుపతి, పీలేరు, వాయల్పాడు, చింతపర్తి, మదనపల్లి తదితర ప్రాంతాల్లో భూమిలోంచి నీరు ఎగదన్ని టాయెలెట్‌లు, మంచినీటి సంపులను కలిపేసి బీభత్సం సృష్టించడంతో జనం తాగునీళ్లుకు కూడా కరువై కకావికలైపోయారు.

 

ఇంత ఉత్పాతం ఉన్నట్లుండి ఊడిపడటంలో బాబు తప్పేమీ లేకపోవచ్చు. కరువు కాటకాలకు, కుండపోత వర్షాలకూ ఆయన ఎలా కారకుడు అని ప్రశ్నించవచ్చు. వానలు పడటం, కరువులు రావడం కూడా పాలకులకు ఆపాదిస్తే ఎలా అని హేతువు అడ్డగించవచ్చు. కానీ వీటన్నిటినీ పక్కన బెడితే వర్షంతో మునిగిపోయిన సీమను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా దెబ్బతింది. వరుసబెట్టి రోజులతరబడి వర్షాలు కుమ్మరిస్తుంటే ముందు జాగ్రత్తగా హెచ్చరించలేకపోయిన ప్రభుత్వం కనీసం ఆపత్సమయంలోనూ కనీస సాయం అందించడంలో విఫలం కావడం జనాలకు ఏవగింపు కలిగిస్తోంది.

 

పైగా వేలాది మంది నిరాశ్రయులై, వరద బాధితులకు సహాయ శిబిరాలు నడుస్తున్నా వాటి నిర్వహణకోసం తహసిల్దార్లకు నయా పైసా నిధులు విదల్చని ప్రభుత్వం నిర్వాకం గురించి సాక్షా్తూ ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు తెగించి చెప్పారంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత మొద్దు నిద్ర పోతోందో గ్రహించవచ్చు. ప్రభుత్వం డబ్బులు విదిల్చక పోవడంతో తహసిల్దారు అప్పుచేసి మరీ ఉన్నంతలో బాధితులను ఆదుకుంటున్న తీరు షాక్ కలిగిస్తోంది

 

తనకెంతో పాలనానుభవం ఉన్నదని, ఈ విషయంలో కేంద్రానికే పాఠాలు చెప్పానని చంద్రబాబు పదేపదే టముకువాయించి విసుగెత్తించేవారు. కానీ ఆపత్కాలంలో బాధితులను ఆదుకోవడానికి ఇంత అనుభవమూ అక్కరకు రాకుండా పోవడం... అధికారులకుండేపాటి మానవతా దృక్పథమైనా ఆయనకు కొరవడటం ఆశ్చర్యం కలిగించే విషయం. జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుని ఎక్కడెక్కడ ఏ స్థాయిలో సాయం అవసరమో లెక్కలు వేసుకోవాల్సిన ప్రభుత్వం అన్నం పొట్లాలు మొదలుకొని సహాయ శిబిరాలు నెలకొల్పడం వరకూ అన్నిటా రాజకీయ కోణంలోనే ఆలోచించిందని వస్తున్న వార్తలు ప్రజలను దిగ్బ్రాంతిలో ముంచెత్తుతున్నాయి

 

సాయం చేయడంలోనే ఇంత వివక్షనూ, ఇంత చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్న సర్కారు.. రేపు పంట నష్టాలకు పరిహారం ఇవ్వడంలోనూ, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ, కూలిన ఇళ్లకు నష్టపరిహారం లెక్కేయడంలోనూ మరెలా వ్యవహరిస్తుందో సులభంగానే ఊహించవచ్చని పరిశీలకులు అంటున్నారు. సమర్థత గురించీ, అనుభవం గురించీ సాధారణ సమయాల్లో డబ్బా కొట్టుకోవడం కాదు...విపత్తులు ఎదురైనప్పుడు సత్తా చూపగలగాలి. ఇప్పుడెదురైన వైఫల్యాలనుంచి పాలకులు గుణపాఠం గ్రహించాలి.

 

ఒకటి మాత్రం నిజం. చంద్రబాబు తొలి తొమ్మిదేళ్ల కాలం ధాతుకరువుతో ఏపీని పట్టి పీడిస్తే, ఆయన మలిపాలనలో వర్షం చుక్కలు చూపిస్తోంది. అటు అనావృష్టిలోనూ, ఇటు అతి వృష్టిలోనూ చంద్రబాబు పాలన దురదృష్టవంత పాలనే అని జనం అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు అడుగుపెట్టాకే ఇంత ఉత్పాతం సీమలో చూసిన అనుభవం జనం జ్ఞాపకాల్లోంచి కనుమరుగవడం కష్టమేనని పరిశీలకుల మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: