ఒకవైపు యువభారత్ ప్రతిభా పాటవాలకు యావత్ ప్రపంచం దాసోహమంటోంది. సిలికాన్ వ్యాలీతో సహా ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలలోని అగ్ర స్థానాలన్నీ భారతీయులతోటే నిండిపోతున్నాయి. అమెరికాలోని టాలెంట్ పోటీల్లో ప్రతి సంవత్సరం భారత సంతతి పిల్లలే తొలిస్థానాల్లో నిలబడుతున్నారు. కాని ఈ ఘనతర చరిత్ర ఏదీ ఐసిసి ఉగ్రవాదుల కంటికి ఆనటం లేనట్లుంది. ఉగ్రవాదులు కూడా భారతీయ ఉగ్ర యోధులను చిన్న చూపు చూస్తున్న వైనం దిగ్భ్రాంతి గొలుపుతోంది.

 

వివరాల్లోకి వెళితే, నేటి ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఉగ్రవాద సంస్థగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ఐఎస్ఐఎస్) ప్రపంచం నలుమూలల్నుంచి యువతను రిక్రూట్ చేసుకుంటున్నప్పటికీ భారతీయులను, దక్షిణాసియానుంచి వచ్చి చేరుతున్న వారిని హీనంగా చూస్తున్నారని అంతర్జాతీయ నిఘా సంస్థలు వెల్లడించాయి. ఐసిస్ ఉగ్రవాదులకు సమానత్వం తెలీదని, జీతాలు, హోదా వంటి విషయాల్లో చాలా తేడాలు పాటిస్తున్నారని నిఘా సంస్థలు బయటపెట్టాయి.

 

అరబ్ ఫైటర్లతో పోలిస్తే భారతీయులు సహా దక్షిణాసియా వాసులు గొప్ప పోరాట యోధులు కాదని ఐఎస్ఐఎస్ భావిస్తోంది. అరబ్ ఫైటర్ల కంటే వారిని తక్కువ స్థాయిగా చూస్తున్నట్టు ఇంటలిజెన్స్ నివేదిక వెల్లడించింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‑ వంటి దక్షిణాసియా దేశాలతో పాటు నైజీరియా, సూడాన్ దేశాల నుంచి ఐఎస్ఐఎస్‑లో చేరిన ఉగ్రవాదులను అరబ్ ఫైటర్ల కంటే తక్కువ స్థాయిలో పరిగణిస్తున్నారు. అరబ్ ఫైటర్లకు ఆపీసర్ కేడర్ స్థాయి కల్పించి, ఆత్యాధునిక ఆయుధాలు, వేతనాలు, వసతులు కల్పిస్తున్నారు. దక్షిణాసియా వారికి మాత్రం అరబ్ ఫైటర్ల కంటే తక్కువ హోదా, జీతాలు ఇచ్చి, చిన్న చిన్న బ్యారక్‑లలో ఉంచుతున్నారు.

 

పైగా ఇరాక్, సిరియాల్లో ఆత్మాహుతి దాడులకు ఎక్కువగా దక్షిణాసియా యువతనే ఉసిగొల్పుతున్నారు. పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని ఇచ్చి, సమీప లక్ష్యంలో దాడులకు వీరిని పంపుతున్నారు. నిఘా సంస్థల నివేదిక ప్రకారం  ఐఎస్ఐఎస్‑లో 23 మంది భారతీయులు చేరగా, వారిలో ఆరుగురు ఉగ్రవాద చర్యల్లో చనిపోయారు. ఉగ్రవాద దాడుల్లో వీరిని సైనికుల మాదిరిగా ముందుకు ఉసికొల్పుపుతూ అరబ్ ఫైటర్లు వెనక ఉంటున్నట్టు నివేదికలు బయటపెట్టాయి.

 

అంటే కారణాలు ఏవైతే కావచ్చు... ఐసిస్‌లో చేరాలని పరుగులెత్తుతున్న భారతీయ యువత, దక్షిణాసియా యువత అక్కడ తమకు ఎదురవుతున్న సత్కారాన్ని వినైనా ఉగ్రవాదుల్లో చేరాలనే ఆలోచనపై పునరాలోచన చేస్తే బాగుంటుంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: