పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయంటే.. దేశంలోని ప్రతి పార్టీ అధినేత కూడా.. తమ పార్టీకి చెందిన ఎంపీలందరితోనూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని.. ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటో, తమ తమ ప్రాంతాలకు కేంద్రంనుంచి గరిష్టంగా ప్రయోజనాలు రాబట్టేలా లేవనెత్తాల్సిన అంశాలు ఏమిటో ప్లాన్‌ చేసుకోవడం చాలా సహజం. అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా.. అందరూ ఈపనిచేస్తుంటారు. ఆ మేరకు వైకాపా అధినేత జగన్‌ కూడా తన పార్టీ ఎంపీలతో మీటింగ్‌ పెట్టుకుని.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాల్సిన కీలక అంశంగురించి పార్లమెంటులో ప్రస్తావించాల్సిన వైనంపై వారికి మార్గదర్శనం చేశారు. అదే తరహా సమావేశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలందరితోనూ నిర్వహించారు. కానీ.. శోచనీయమైన విషయం ఏంటంటే... ఆయన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన అనేకానేక అంశాల్లో.. అసలు ఏపీకి ప్రత్యేకహోదా గురించి గానీ, ప్యాకేజీలను సాధించాల్సిన అవసరం గురించి గానీ.. ఒక్క పాయింటు కూడా లేకపోవడం. 


చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేవలం కొన్ని అంశాల గురించి మాత్రమే చర్చించారు. ఇవన్నీ ఆల్రెడీ కేంద్రంనుంచి స్పష్టమైన హామీలు ఉన్న అంశాలు మాత్రమే. విశాఖకు రైల్వేజోన్‌ అడగాలని, విభజన చట్టంలో 9, 10 సెక్షన్లలో ఉన్న అంశాల గురించి అడగాలని ఆయన తన ఎంపీలకు దారి చూపించారు. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడానికి సంబంధించి కేంద్ర సహకారం అడగాలని కూడా చంద్రబాబు వారికి చెప్పారుట. 


నిజానికి చంద్రబాబునాయుడు ఎంపీలతో భేటీ పేరిట నిర్వహించిన తతంగం మొత్తాన్ని గమనిస్తే.. ఏదో పార్లమెంటు జరగబోతున్నది గనుక.. మొక్కుబడిగా ఒక సమావేశం నిర్వహించినట్లే ఉన్నది తప్ప.. రాష్ట్రానికి కావాల్సిన వాటికోసం చిత్తశుద్ధితో పార్టీ తరఫున పార్లమెంటు వేదికగా కొత్త అంశాలను ప్రతిపాదించి సాధించడం గురించి ప్రయత్నిస్తున్నట్లుగా లేదు. కనీసం ప్రత్యేకహోదా గురించి గానీ, ప్యాకేజీల గురించి గానీ అడగాలనే మాట కూడా చెప్పకుండా ఎంపీలను ఢిల్లీ సమావేశాలకు పంపడం అంటేనే... చంద్రబాబునాయుడు.. కేంద్రంతో కీలకమైన ఈ విషయంలో ఎంత లాలూచీ మార్గాన్ని అవలంబిస్తున్నారో అర్థమవుతోంది. ఆ మాటకొస్తే.. ఏపీకి అసలు హోదా వచ్చే అవకాశమే లేదు.. అంటూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే జేసీ దివాకర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు కంటె చాలా బెటర్‌ అని, ప్రజలను మాయచేసే ఉద్దేశం ఆయనకులేదని ప్రజలకు అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: