వరంగల్ ఉపఎన్నికల్లో కారు మరోసారి దుమ్మురేపింది. ఎన్నికల రేసులో వెనక వస్తున్న వారిపై ముఖాలపై కారు రేపిన దుమ్ము బెత్తెడు మందాన పేరుకుపోయింది. కనీసం ప్రధాన పార్టీలకు సైతం డిపాజిట్లు దక్కలేదు. ప్రత్యేకించి టీడీపీ విషయానికి వస్తే.. బీజేపీతో కలసి జట్టుకట్టి బరిలో దిగినా కనీసం సెకండ్ ప్లేస్ కూడా దక్కలేదు. చివరకు టీడీపీ ఎమ్మెల్యేలున్న ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 

ఈ ఉపఎన్నికల ఫలితం టీడీపీ నేతలను ఆలోచనలో పడేసింది. ప్రధానంగా కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డికి ఈ ఫలితాలు ఒకరకంగా మైండ్ బ్లాక్ చేసేవే. కేసీఆర్ ను బండబూతులు తిట్టడంతోనే తానూ ఆ స్థాయి లీడర్ నని భ్రమిస్తున్నారని రేవంత్ రెడ్డిపై ఓ అపవాదు ఉంది. పసుపు మీడియా అండదండలు పుష్కలంగానే ఉన్నా.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో దాని ప్రభావం ఏమీ కనిపించడం లేదు. 

చంద్రబాబును ఒప్పించి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ అంత సానుకూలంగా ఏమీ కనిపించం లేదు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ జోడీ గెలుస్తుందన్న భ్రమలు ఆ రెండు పార్టీలకూ లేవు. కాకపోతే.. రైతుల ఆత్మహత్యలు, కేసీఆర్ ఎన్నికల హామీల అమలు వైఫల్యం, పసుపు మీడియా వ్యతిరేక ప్రచారం.. అన్నీకలిపి టీఆర్ఎస్ మెజారిటీకి గణనీయంగా గండికొడతాయని రేవంత్ వంటి నేతలు ఆశించారు.

ఫలితాలు మాత్రం ఆ ఆశలకు పూర్తిగా గండికొట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఆలోచనలో పడ్డారట. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లిపోయినట్టేనని విశ్లేషణలు వస్తున్న తరుణంలో ఇంకా మునిగే పడవలో ఉండటం ఎందుకని ఆయన అనుచరులు కొందరు అంటున్నారు. పోనీ.. రెడ్డి మార్కు చూపించి కాంగ్రెస్ లోకి వెళ్లినా.. అక్కడా పరిస్థితి అంత బావున్నట్టు లేదు. ఈ నేపథ్యంలో తన భవితవ్యంపై రేవంత్ తీవ్రంగా మథనపడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన ఏ స్టెప్ తీసుకుంటారో..!


మరింత సమాచారం తెలుసుకోండి: