వరంగల్ ఉప ఎన్నిక ప్రతిపక్షాలను అన్నింటినీ సమానంగా ఊడ్చి పడేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ, అందరికన్నా ఎక్కువ దెబ్బ వైకాపామీదే పడింది. ఎంత దెబ్బ అంటే.. ఇక కేసీఆర్‌కు, తెరాస పార్టీకి జగన్ అండ్ కో అవసరం ఏమాత్రమూ లేనంతగా.. వైకాపా అధినేతపై ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే రంగం మీదికొచ్చాడని అనవసరంగా తెలుగుదేశం-బీజేపీ కూటమి ఆడిపోసుకుంది గానీ జగన్‌కు అంత సీన్ లేదని జగన్ సునాయాసంగా ఉపఎన్నిక ద్వారా ప్రదర్శించేసుకున్నారు.

 

వాస్తవానికి ప్రతిపక్షాల ఓట్లను చీల్చడం మాట దేవుడెరుగు కానీ, వరంగల్ ఉప ఎన్నిక ద్వారా ఉన్న పరువును కాస్త జగన్ పార్టీ పోగొట్టుకుందని భావిస్తున్నారు. ఒక స్వతంత్ర పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా దక్కించుకోలేని పార్టీగా వైకాపా ఘోరంగా తన్ను తాను దెబ్బతీసుకుంది. టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమిలను ఎలాగూ బీట్ చేయలేదని అనుకున్నారు కానీ నాలుగో స్థానాన్ని కూడా శ్రమజీవి పార్టీ అనే అనామక పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థికి అప్పగించేసి అచ్చంగా అయిదో స్థానంలోకి పడిపోయిన వైకాపా ఇక ఏం ముఖం పెట్టుకుని తెరాసకు కాపు కాచే ప్రయత్నాలు చేపడుతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

 

తెరాసకు 6 లక్షలపైగా ఓట్లు, కాంగ్రెస్‌ పార్టీకి, బీజేపీ-తెదేపా కూటమికి చెరొక లక్షన్నర పైగా ఓట్లు నమోదైన చోట శ్రమజీవి పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లకన్నా (28,540) తక్కువగా వైకాపా 23,352 ఓట్లు సాధించి ఇక చాల్లే అని సంతృప్తి పడిపోవడం ఇతరుల కన్నా ఆ పార్టీలోని నేతలను, కార్యకర్తలనే తీవ్ర నిరాశలో ముంచెత్తుతోంది.

 

ప్రతిపక్షాలు చేస్తున్న ఎడతెరిపి లేని వ్యతిరేక ప్రచారం ఒక దశలో తెరాస అగ్రనాయకత్వాన్ని కలవరపర్చింది. తన అభ్యర్థి గెలపుమీద సందేహం లేనప్పటికీ ఎందుకైనా మంచిదని చివర్లో వైకాపా తరపున అభ్యర్థిని పోటీలో నిలపడంలో కేసీఆర్ సఫలం అయ్యారు కానీ ఇంత చెత్త పలితాలను వైకాపా సాధిస్తుందని తెరాస కల్లో కూడా అనుకోలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తెలంగాణాలో ఏ రకంగానైనా సరే పార్టీని పునరుద్ధరించాలన్న జగన్ కోరిక కలగానే మిగిలిపోనుంది.

 

తనమీద తానే వరుసగా వేసుకుంటున్న సెల్ఫ్ గోల్‌లలో వరంగల్ ఉప ఎన్నిక మరొకటిగా వైకాపా చరిత్రలో నిలిచిపోయింది. అంతకుమించి ఇకమీదట జగన్ అవసరం కేసీఆర్‌కి పెద్దగా ఉండకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఒంటెత్తుపోకడలు, అతి వ్యూహాలు, వాస్తవదూరమైన అంచనాలు, రాజకీయ పరిణామాలను సరిగా అంచనా వేయడంలో కోటరీ ఘోరవైఫల్యం అన్నీ కలిసి వైకాపా అధినేత పుట్టి ముంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: