చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసును విచారిస్తున్న కొద్దీ మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్‌లోనే జరుగనున్న తన కుమార్తె సీమంతానికి రావలసిందిగా తన మేనల్లుడు చింటూకు మేయర్ అనూరాధ వ్యక్తిగతంగా కలిసి మరీ ఆహ్వానం పలికారని తెలుస్తోంది. అయినప్పటికీ కనికరం కూడా లేకుండా చింటూ మేయర్ దంపతులను తన చేతులారా కాల్చి చంపేసిన వైనం దిగ్భ్రాంతి పరుస్తోంది.

 

లొంగిపోయిన హంతకులను విచారిస్తున్న పోలీసులు పనిలో పనిగా హత్యకు గురైన మేయర్ దంపతులకు చెందిన ఇతర బంధువులను కూడా విచారిస్తున్నారు. మేయర్ దంపతుల బంధువులతో పోలీసులు చేస్తున్న సంప్రదింపుల వల్ల మేయర్ దంపతులకు, వారి మేనల్లుడికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

 

తమ మధ్య కుటుంబపరమైన విభేదాలను సైతం పక్కనబెట్టిన మేయర్ అనూరాధ తన మేనల్లుడికి ఫోన్ కాల్ చేసి మరీ తన కుమార్తె హేమలత సీమంతానికి రావలసిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నవంబర్ 1న ఈ శుభకార్యం జరగాల్సి ఉండింది. కాని తనకు కాల్ చేసి మరీ ఆహ్వానించిన మేయర్‌ను చింటూ హెచ్చరిస్తూ తాను నిజంగా ఆ ఫంక్షన్‌కే వచ్చినట్లయితే మేయర్ తన భర్తను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని తెలుస్తోంది.

 

అయినప్పటికీ చింటూ హెచ్చరికలను మేయర్ దంపతులు తీవ్రంగా తీసుకోలేదని, చింటూ తన ఉద్దేశాలను ముందే స్పష్టంగా బయటపెట్టినా అనూరాధ దంపతులు పట్టించుకోలేదని తెలుస్తోంది.  మేయర్ దంపతులను చంపడానికి గాను తమకు చింటూ ఆరునెలల క్రితమే పెద్ద మొత్తంలో డబ్బును ఇచ్చాడని లొంగిపోయిన హంతకులు పోలీసులకు చెప్పారు. ఈ హత్యకోసం చింటూ 50 లక్షల డబ్బును హంతకులకు ఇచ్చాడని విచారణలో తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: