వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కెమేరాను చూస్తే చాలు ఉలిక్కిపడుతున్నారు. కెమేరా అంటే సెల్ ఫోన్ కెమేరాలు కాదండోయ్. ఫోటోలు తీసేందుకు మాత్రమే వాడే కెమేరా. ఇంతకీ కెమేరాను చూస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారు. ఆ కెమేరాలో ఏమైనా జగన్ సీక్రెట్స్ ఉన్నాయా.. రహస్య కార్యకలాపాల ఫుటేజ్ ఏమైనా ఉందా.. అని అప్పుడే ఊహించేయకండి. అలాంటిదేమీ లేదు. 

మరి జగన్ కు కెమేరా అంటే ఎందుకంత ఉలికిపాటు. అందుకు సరైన కారణమే ఉంది. ఎందుకంటే వరంగల్ ఎన్నికల బరిలో జగన్ పరువు తీసింది ఆ కెమేరాయే. కెమేరా ఎలా జగన్ పరువు తీస్తుందనుకుంటున్నారా.. ఔను నిజంగా కెమేరాయే జగన్  పార్టీ అభ్యర్థిని వరంగల్ లో ఐదో స్థానంలో నిలిపింది. వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుస్తామన్న భరోసా ఎలాగూ వైసీపీకి లేదు. కనీసం సెకండ్, థర్డ్ ప్లేసులపైనా అంతగా ఆశ లేదు. 

ఐతే.. కనీసం నాలుగో స్థానమైనా వస్తుందిలే అన్న ధీమా ఉండేది. ఐతే. విచిత్రంగా ఆ స్థానం కూడా దక్కలేదు. ఆ ప్లేస్ శ్రమజీవి అనే పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి తన్నుకుపోయాడు. మరి ఓ ఇండిపెండెంట్ కు 28 వేల ఓట్లు ఎలా వచ్చాయి. అందులోనూ ఆ అభ్యర్థి ఏ రకంగానూ పాపులర్ కాదు. మరి ఎలా వచ్చాయంటే.. అది ఆయనకు కేటాయించిన కేమేరా గుర్తు వల్లనేనంట.

కెమేరా గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉండటం.. ఓట్లేసిన రెండు ఈవీఎంలోని రెండో దాంట్లో ఆయన పేరు మొదట ఉండటం వల్ల టీఆర్ఎస్ ఓటర్లు కన్ ఫ్యూజ్ అయ్యారట. కారు గుర్తే అనుకుని శ్రమజీవి భాస్కర్ కు గుద్దేశారట. దాంతో ఆయనకు 28 వేల వరకూ ఓట్లొచ్చాయి. జగన్ పార్టీ 23 వేల ఓట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు జగన్ కు ఓడిపోయినందుకు కాదు.. కనీసం నాలుగో స్థానం కూడా దక్కనందుకు బాగా ఫీలవుతున్నారట. అందుకే ఇంత అవమానానికి కారణమైన కెమేరాను చూస్తే చాలు మండిపడుతున్నారట. అదీ సంగతి. 


మరింత సమాచారం తెలుసుకోండి: