ఆంధ్రజ్యోతి పత్రికకూ, టీఆర్ఎస్ అధినేతలకూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వరంగల్ ఉప ఎన్నిక ముగిసినా దాని తాలూకూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం కోసం ఆంధ్రజ్యోతి పనిగట్టుకుని దుష్ప్రచారం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల జోరు ఊపందుకుంటున్న దశ నుంచి పోలింగ్ ముందు రోజు వరకూ ఆ పత్రిక, ఛానల్ కథనాలు ఈ ఆరోపణలకు ఊతమిచ్చాయి. 

చివరకు ఫలితం గులాబీదళానికి పూర్తి అనుకూలంగా వచ్చింది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. తమపై ఎంత దుష్ప్రచారం చేసినా తామే గెలిచామని సంబరపడుతున్నారు. ఉపఎన్నిక ఫలితం వచ్చిన రోజే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆంధ్రజ్యోతిని ఉద్దేశించి విమర్సలు చేశారు. కొందరు ఇష్టం వచ్చినట్టు రాతలు రాశారని.. కానీ జనం టీఆర్ఎస్ నే నమ్మారని తలసాని ఇన్ డైరెక్టుగా కామెంట్లు చేశారు. 

ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ డైరెక్టుగానే మాటలకు పదును పెట్టారు. మొహమాటం లేకుండా ఆంధ్రజ్యోతి తీరును ఏకిపారేశారు. ప్రతిపక్షాలు ఆంధ్రజ్యోతి పత్రికనే ప్రపంచం అనుకుని బోల్తాపడ్డాయని ఎద్దేవా చేశారు. ఆంద్రజ్యోతి పత్రిక ఇష్టం వచ్చినట్లు ఏదో రాస్తే.. అదే నిజమని విపక్షాలు ప్రచారం చేశాయని కేసీఆర్ మండిపడ్డారు. ఆ పత్రిక పని గట్టుకుని టీఆర్ఎస్ పార్టీపైనా, నేతలపైనా పిచ్చి రాతలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆంధ్రజ్యోతి మొదటి నుంచి తమ పాలనపై కువిమర్శలు చేస్తోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అడ్డు తగలడమే పనిగా పెట్టుకుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాము మిషన్ కాకతీయ చేపడితే.. కమిషన్ కాకతీయ అంటూ దుష్ప్రచారం చేసిందని గుర్తు చేశారు. హుస్సేన్ సాగర్ ను శుద్ది చేస్తామని అన్నా దాన్ని కూడా వివాదం చేశారన్నారు కేసీఆర్. పండుగలను ఆదరిద్దామని, తాను నిధులు ఇస్తే కేసీఆర్ బిడ్డ కోసం ఇచ్చారని ఆ పత్రికలో రాశారన్నారు కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: