''పచ్చ బొట్టేసిన పిల్లగాడా మరి.. పచ్చి ప్రాయాలనే దోచుకున్నావురా'' అని ఆనం బ్రదర్స్‌ ఇప్పుడు సాంగేసుకుంటున్నారు. ఎట్టకేలకు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెసు నాయకులు... ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి తమ రాజకీయభవిష్యత్తుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల అనుబంధాన్ని వదలుకుని కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఈ విషయమై జిల్లాలోని తమ అనుచరులందరితోనూ గురువారం నాడు ఇంట్లోనే సమావేశం నిర్వహించుకుని.. వాళ్లందరినీ కన్విన్స్‌ చేసే ప్రయత్నం కూడా చేసేశారు. 


నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు కాంగ్రెసు పార్టీతో తెగతెంపులు చేసుకుని... పార్టీ మారే విషయంలో చాలా కాలంగా పుకార్లు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెసును వీడుతున్న ఈ ఇద్దరు నాయకులు.. రాష్ట్రంలో ఎన్ని పార్టీలైతే ఉన్నాయో అన్ని పార్టీల్లోనూ చేరబోతున్నారంటూ పుకార్ల మీద పుకార్లు వచ్చాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరుతారంటూ తొలుత పుకార్లు వచ్చాయి. వాటిపై సోదరులిద్దరూ గుంభనంగానే ఉన్నారు. తర్వాత జిల్లాలో స్థానిక రాజకీయాల నేపథ్యంలో ఆనం సోదరులు పార్టీలోకి వస్తే.. మేకపాటి ఫ్యామిలీ పార్టీని వీడిపోతుందని, వారిని వదులుకోవడానికి జగన్‌ సిద్ధంగా లేడని క్లారిటీ వచ్చింది. అంటే ఆనం సోదరులకు అక్కడ 'నో ఎంట్రీ' బోర్డు చూపించారన్నమాట. 'అసలు వైకాపాలోకి మేమెందుకు వెళ్తాం.. జగన్‌ను ముందు విమర్శించిందే మేం' అంటూ ఇద్దరూ తర్వాత కొత్త పాట పాడారు. తర్వాత వీరు భాజపాలోచేరే చాన్సున్నదంటూ కొన్ని వార్తలు వచ్చాయి. తెదేపా వైపు మొగ్గుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. 


ఎట్టకేలకు వారు తమ ఫైనల్‌ డెసిషన్‌ తీసుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి ఆ విషయాన్ని ప్రకటించేశారు కూడా! మా మొగ్గు చాలా కాలంనుంచి తెలుగుదేశం వైపు మాత్రమే ఉన్నదని.. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని.. తెలుగుదేశం వైపు వెళ్లడానికి చూస్తున్నామని చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాలు మొక్కుబడి మాత్రమేనని, అభిప్రాయాలు తీసుకోవడం అంటే.. వీరి అభిప్రాయాన్ని వారికి తెలియజేయడం మాత్రమే అని ఎవ్వరైనా ఊహించవచ్చు. ఇక పైన చెప్పుకున్నట్లుగా.. తమ రాజకీయ కెరీర్‌ మీద ఆనం బ్రదర్స్‌ ఇద్దరూ పచ్చబొట్టు ముద్ర వేయించుకోవడానికి ముహూర్తం నిర్ణయించడం ఒక్కటే తరువాయిగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: