ఆంధ్రాలో సంచలనం సృష్టించిన వనజాక్షి ఇష్యూ గుర్తుంది కదా.. ఇసుక అక్రమాలను ధైర్యం ఎదుర్కొనేందుకు ప్రయత్నించి ఎమ్మెల్యే చింతమనేని చేతిలో అవమానానికి గురైన ఈ ఎమ్మార్వో ఉదంతం కొన్ని నెలల క్రితం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎమ్మెల్యే చింతమనేని ఇసుక దందాను అడ్డుకునేందుకు ఏకంగా ట్రాక్టర్ కు అడ్డంగా కూర్చునే సాహసం చేసింది. అయితే ఎమ్మెల్యే మనుషులు ఆమె చీరలాగి.. ఈడ్చి అవతలకు పారేసి నానా హంగామా చేశారని పత్రికలు కోడై కూశాయి. 

అప్పట్లో చంద్రబాబుకు ఈ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. అప్పట్లో విదేశీ పర్యటనలో ఉన్న బాబు ఏపీకి రాగానే వనజాక్షిని, ఎమ్మెల్యేని పిలిపించి సెటిల్ మెంట్ చేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే ఈ ఇష్యూపై ఆయన డిటైల్డ్ గా మీడియాతో మాట్లాడలేదు. గురువారం ఇసుక విధానం ప్రకటించిన చంద్రబాబుకు మీడియా నుంచి వనజాక్షి ఇష్యూపై ప్రశ్నలు వచ్చాయి. 

చంద్రబాబు ఎమ్మార్వో వనజాక్షి తీరుపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో తన పరిధికి మించి ప్రవర్తించేశారని తీర్పు ఇచ్చారు. ఓ ఎమ్మెల్యే వచ్చి నిరసన చెబుతున్నప్పుడు ఆమె కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే సరిపోయేదని.. ఆమె మొండిగా వ్యవహరించి వివాదం చేశారని తేల్చి చెప్పారు. పనిలో పనిగా అటు ఎమ్మెల్యే కూడా ఆవేశపడ్డారని ఓ మాట అన్నారు. 
 
అయితే వనజాక్షి కానీ.. ఇటు చింతమనేని కానీ ఇద్దరూ పబ్లిక్ కాజ్ కోసమే కొట్లాడారని ఇధ్దరినీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని వనజాక్షి ప్రయత్నిస్తే.. డ్వాక్రా మహిళలకు న్యాయం చేసేందుకు చింతమనేని ప్రయత్నించారని.. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వివాదం వచ్చిందని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా వనజాక్షి కలెక్టర్ ఫిర్యాదు చేస్తే సరిపోయేదని సీఎం అనడం అంత సబబుగా లేదు. అలాగైతే ఇక ప్రతి విషయంపైనా కిందిస్థాయి అధికారులు కలెక్టర్లకే చెప్పి వదిలేస్తే పాలన సజావుగా సాగుతుందా..!?


మరింత సమాచారం తెలుసుకోండి: