వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక ముగిసినప్పటికీ దాని ప్రతిధ్వనులు ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాజకీయ ఆకర్షణే బలంగా సాగిన, సాగుతున్న తెలుగు రాష్ట్ర్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో పాలకపక్షాన్ని ఎదుర్కోగలిగిన చరిష్మా ఏ పార్టీలోనూ లేకపోవడమే కేసీఆర్‌ని తెలంగాణ రాజకీయాల్లో శిఖరస్థాయిలో నిలిపింది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ నేతలు పూర్తిగా జావగారిపోవడం తెరాసకు ఆయాచిత వరంలాగా లాభించింది.

 

ఎన్టీఆర్ నుంచి మొదలుకుని చూస్తే సమైక్యాంద్రప్రదేశ్‌లో జనాకర్షణ కలిగిన నేతల హవానే నడిచింది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖరరెడ్డి కేవలం తమ ప్రజాకర్షక శక్తియుక్తుల తోటే రాజకీయాల్లో మనగలిగారు. వీరు తమ సొంత బలంమీదే, ఆకర్షణ శక్తితోటే ప్రజల హృదయాలను గెల్చుకోగలిగారు. సరిగ్గా అదే విధంగా కేవలం కేసీఆర్ చరిష్మాతోనే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.

 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరికొంత కాలం ఇదే పునాదిమీదే నడుస్తాయని సంకేతాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఇదే పెద్ద అవరోధంగా మారుతోంది. కేసీఆర్‌ను పోలిన జనాకర్షక వ్యక్తి తెలంగాణ ప్రతిపక్షాల్లో ఏ పార్టీలోనూ లేకపోవడమే వాటి బలహీనత కాగా, సరిగ్గా ఈ బలహీనతే కేసీఆర్ బలమై కూర్చుంది.

 

తెలంగాణలో ఈవిధంగా జనాలను ఆకర్షించగలనని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ప్రారంభంలో హామీ ఇచ్చాడు గానీ ఓటుకు నోటు కేసుతో జావగారిపోయాడు. ఇప్పుడు ఈ కేసు తార్కిక ముగింపుకు చేరుకోలేదని స్పష్టమవుతోంది. రేవంత రెడ్డి తన మచ్చను తొలగించుకుని మళ్లీ ప్రజల్లో స్తానం సంపాదించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. నాయకత్వ సంక్షోభం పాలక పార్టీకి విజృంభించేందుకు మంచి అవకాశమైంది. ప్రతిపక్ష పార్టీలలో ఏదీ ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించకపోవడం కూడా తెరాస బలాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: