వరంగల్ ఉప ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం ప్రభావంతో ఐటీ మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మధ్యందిన మార్తాండుడిలా తెలంగాణ రాష్ట్ర సమితిపై తన పట్టును మరింతగా నిలుపుకున్నారు. కడియం శ్రీహరి, హరీష్ రావు వంటి సీనియర్లతోపాటు చెల్లెలు కవిత  సిఫారసులను సైతం తోసిపుచ్చి పసునూరి దయాకర్‌కి స్వయంగా తెరాస టికెట్‌ ఇప్పించిన కేటీఆర్ అందరినీ నిరుత్తరులను చేసి వరంగల్ గెలుపు బాధ్యతను వ్యక్తిగతంగా తన భుజంమీద వేసుకున్నారు. అల్లుడు హరీష్, కూతురు కవిత మాటలను కూడా పక్కన బెట్టి కేటీఆర్ సూచించిన అభ్యర్థికే టికెట్ దక్కేలా చేసిన కేసీఆర్ వరంగల్ ఉపెఎన్నిక గెలుపు భారాన్ని పూర్తిగా కేటీఆర్ పైనే పెట్టేశారు.

 

తండ్రి మోపిన భారాన్ని సవాలుగా తీసుకున్న కేటీఆర్ దాదాపు రెండు వారాలపాటు వరంగల్ లోనే తిష్ట వేసి ప్రచారం కొనసాగించారు. దయాకర్‍‌కు ఓటేయమని కోరుతూ మారుమూల గ్రామాల్లో సైతం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. దయాకర్ గెలుపు బాధ్యత అందరికంటే తనమీదే పడటంతో ఒక దశలో కేటీఆర్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. పైగా 2014 ఎన్నికల్లో కడియం శ్రీహరి సాధించిన మూడు లక్షల 90 వేల మెజారిటీని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా కేటీఆర్ పైనే పడింది.

 

అదేసమయంలో తెరాస ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని వరుసగా నివేదికలు రావడం తెరాస శ్రేణులను కలవరపర్చాయి. పైగా ప్రతిపక్షాలు జాతీయ, రాష్ట్ర నేతలను మోహరించి మరీ ప్రచారం చేయడంతో గెలుపు తప్పకున్నా, మెజారిటీ మాత్రం రాదని భావించారు.

 

కాని తన అనుచరుడు దయాకర్ చివరకు 4.50 లక్షల పైగా భారీ మెజారిటీతో వరంగల్ ఉపఎన్నికను ఎగురేసుకుపోవడం కేటీఆర్‌ని అమితానందంలో పడవేసింది. ప్రతిపక్షాలు డిపాజి్ట్లను కూడా కోల్పోవడం కేటీఆర్‌కు అదనపు బోనస్‌గా మారింది. ఈ మొత్తం ప్రక్రియను చూస్తే తెరాస తదుపరి వారసుడు కేటీఆరేనని తిరుగులేకుండా రుజువైపోయింది. 2019 ఎన్నికల తర్వాత కేసీఆర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని భావిస్తున్నందున తెరాస అధ్యక్ష పదవికి కేటీఆరే తిరుగులేని వారసుడయ్యారని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: