మెత్తమెత్తగానే కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భారీ ఫిటింగుపెట్టేశారు. హైదరాబాదులో ఉన్న శిక్షణ సంస్థలు అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు కూడా 'ప్రపోర్షనేట్‌'గా కోటా కావాలని అంటున్నారు. విభజన చట్టం రూపొందే సమయానికి నోరు మెదపలేకుండా.. నాటకాలు ఆడఱుతూ కూర్చున్న తెలుగుదేశం.. ఆ బిల్లు చట్టం రూపం దాల్చిన రెండేళ్ల తర్వాత బిల్లులో లోపాలు ఉన్నాయంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కడం చాలా నీతిబాహ్యంగా ఉన్నదని విమర్శకులు అంటున్నారు. 
వివరాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి శుక్రవారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ను కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు. హైదరాబాదులో ఉండే శిక్షణ విద్యాసంస్థలకు సంబంధించిన వినతిపత్రం అది. 


నిజానికి కొన్నిరోజుల కిందట ఎంపీలతో చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహించినప్పుడే.. విభజన చట్టంలోని 9, 10 సెక్షన్ల ప్రకారం.. హైదరాబాదులోని అన్ని సంస్థల పంపకాలు జరగాలంటూ.. ఆ మేరకు కేంద్రాన్ని కోరాలంటూ చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే అందులో గూఢార్థం చాలా లోతుగానే ఉన్నట్లుంది. ఇప్పుడు సుజనా చౌదరి, హోంమంత్రి రాజ్‌నాధ్‌కు ఇచ్చిన వినతిపత్రం ప్రకారం ఏం అంటున్నారంటే.. హైదరాబాదులో గతంలో ఏర్పాటుచేసిన శిక్షణ విద్యాసంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లోని ఏడు కోట్ల ప్రజానీకం అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన సంస్థలని అంటున్నారు. నిజానికి ఇందులో చాలా సంస్థలు జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినవిధంగా కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు కేవలం పది జిల్లాల రాష్ట్రానికి ఈ సంస్థలకు పరిమితం చేస్తే.. ఆ సంస్థలు వీరి అవసరాలకు మించిపోతాయంటూ వివరిస్తున్నారు. ఇంతకూ ఆయన చెబుతున్నది ఏంటంటే.. హైదరాబాదులోని సంస్థలన్నింటిలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల వారికి కూడా ఎడ్మిషన్లు హక్కుభుక్తంగా దక్కవలసిందేనట. ఈ మేరకు విభజనచట్టంలో తదనుగుణమైన మార్పులు చేయాల్సిందిగా ఆయన కేంద్రంలోని రాజ్‌నాధ్‌ను కోరుతున్నారు. 


ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద నష్టం కిందే లెక్క. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ రాష్ట్రానికి చెందుతాయని విభజన చట్టం స్పష్టంగా పేర్కొంటున్నది. ఆ నేపథ్యంలో తెలంగాణకు చెందిన సంస్థలో ఇప్పుడు ఏపీ వాటా కోరుతున్నట్లుంది. మరి దీనికి తెలంగాణ ఎంత ఘాటుగా స్పందస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: