చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయాల్లో అతి పరమ రొటీన్ డైలాగుల్లో ఇదొకటి. అవును చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరూ ఆ పనిలో వేలు పెట్టనంతవరకూ. కానీ అధికారంలో ఉన్నవారు ఆ చట్టం అనే సర్పాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటే.. తమ రాజకీయ అవసరాల కోసం అధికారం అనే నాగస్వరంతో ఆడిస్తే అడ్డుకునేవారెవరు.. చాలా కేసుల విషయంలో జరిగేది అదే. 

కొన్ని నెలల క్రితం వరకూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. చంద్రబాబును ఈ ప్రపంచంలో ఎవరూ కాపాడలేరంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్ ఆ తర్వాతి కాలంలో అమరావతి వెళ్లి మరీ  ఆయన్ను కావలించుకున్నారు. ఓటుకు నోటు కేసును ఫోన్ ట్యాపింగ్ కేసుతో తిప్పికొట్టి.. ఆనక గులాబీ సర్కారుతో గూడుపుఠాణి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. 

దాని ఫలితమే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వెల్లివెరిస్తున్న సోదరభావం అనే అభిప్రాయం అంతటా ఉంది. మరి ఈ రహస్య ఒప్పందం ఏంటనే దాన్ని మాత్రం ఎవరికి వారు తమకు తోచిన రీతిలో విశ్లేషించుకున్నారు. ఆనాటి నుంచి ఆ రెండు కేసులూ ఫైళ్లలోనే కుంభకర్ణ నిద్ర ప్రారంభించాయి. కానీ ఇప్పుడు ఓటుకు నోటు కేసు మళ్లీ అకస్మాత్తుగా నిద్రలేచి జూలు విదులుస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మరో నిందితుడు మత్తయ్యల స్వర పరీక్షలకు సంబందించిన నివేదికలను పోరెన్సిక్ ప్రయోగ శాల నిర్థరించిందని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులోని వీడియో టేపులు వాస్తవమైనవేనని ధ్రువీకరణ అయ్యిందట. అదే నిజమైతే ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో టెస్ట్ కూడా జరగాల్సి ఉంది. 

అంతా సెటిల్ అయ్యిందని భావిస్తున్న సమయంలో మళ్లీ ఈ నోటుకు ఓటు కేసు కదలిక అంతరార్థమేంటి.. బాబును ఈ కేసు అడ్డుపెట్టుకుని కేసీఆర్ బెదిరిస్తున్నారా.. రహస్య అవగాహన ఒప్పందంలో తేడాలొచ్చాయా.. దీనికి విరుడుగుగా మళ్లీ ఏపీ సర్కారు ఫోన్ ట్యాప్ కేసును బయటకు తీస్తుందా.. మళ్లీ ఇద్దరు చంద్రలపోరు భీకరం కానుందా.. అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: