పిట్ట కొంచెం.. కూత ఘనం.. ఈ నానుడికి నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని చెప్పుకోవచ్చు. మనిషి కాస్త పొట్టే అయినా మాటలు మాత్రం చాలా పదును. అవతలి పక్షం నేత ఎంతటి వాడైనా నిర్భయంగా కౌంటర్లు విసరడం, పంచ్ డైలాగులతో కేక పెట్టించడం రేవంత్ స్పెషాలిటీ. కేసీఆర్ వంటి నాయకుడిని డైరెక్ట్ గా ఎటాక్ చేయడంతో రేవంత్ క్రేజ్ అమాంతం పెరిగింది. 

రేవంత్ రెడ్డి డైలాగులే కాదు. రాజకీయ నిబద్దత కూడా చెప్పుకోదగిందే.  అతన్ని తమ వైపుకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ చాలా ప్రయత్నాలే చేసిందని చెప్పుకుంటారు. అయినా సరే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీనే ఆయన నమ్ముకున్నారు. అలా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగారు. అయితే ఇటీవల ఆయనకు వేరే పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ఉంటావా అంటూ ఆఫర్ వచ్చిందన్న విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.

మొన్నటి వరంగల్ ఉపఎన్నికల ప్రచారం సమయంలో కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఓ సభలో రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగ్వార్ పాల్గొన్నారట. ఆ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం, దానికి వచ్చిన స్పందన చూసి సదరు మంత్రి డంగైపోయారట. వారెవా ఇలాంటి వాగ్దాటి ఉన్ననేత తమ పార్టీలో ఉంటే బాగని ఫీలయ్యారట. 

అంతేకాదు.. రేవంత్ ప్రసంగం పూర్తయిన వెంటనే.. కేంద్రమంత్రి ఆయన్ను ప్రత్యేకంగా పక్కకు పిలిపించుకుని చాలా బాగా మాట్లాడారని ప్రత్యేకంగా మెచ్చుకున్నారట. మీరు మా బీజేపీలోకి వస్తే.. సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేస్తామని ఆఫర్ ఇచ్చారట. ఊహించని ప్రశంసలు, ఆఫర్ తో రేవంత్ ఉక్కిరిబిక్కిరి అయ్యారట. చివరకు ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట. 

అయితే ఓ పసుపు మీడియాలో ఈ కథనం ప్రముఖంగా వచ్చింది. మరి ఇది వాస్తవంగా జరిగిందా.. లేక రేవంత్ ఇమేజ్ ను ఆకాశానికెత్తడానికి సదరు మీడియా అల్లిన ప్రాయోజిత కథా అన్న సంగతిపై క్లారిటీ లేదు. ఏదేమైనా ఇక తెలంగాణలో టీడీపీకి ఫ్యూచర్ లేదు.. ఉంటే గింటే బీజేపీకే అని పరోక్షంగా ఈ కథనం సందేశం ఇస్తున్నట్టు లేదూ..!?


మరింత సమాచారం తెలుసుకోండి: