భారత దేశంలో జన్మించిన అపర మేథావుల్లో అంబేద్కర్ ఒకరు. మన దేశ దరిద్రగొట్టు కుల రాజకీయాల పుణ్యమా అని ఆ మేధావిని కేవలం దళితులకు చెందిన నాయకుడిగా ముద్ర వేయించుకున్నారు. ఒక దేశం రాజ్యాంగాన్ని రచించడమనే మహత్కార్యాన్ని తన భుజస్కంధాలపై మోసిన మేధావి. ఆ దార్శనికుడిని ఇన్నాళ్లూ కాంగ్రెస్ అంతగా పట్టించుకోలేదంటూ ఇప్పుడు బీజేపీ చెబుతోంది. 

అంబేద్కర్ 125 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని రాజ్యాంగ రచన పూర్తి చేసిన నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూప్రత్యేకంగా రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలన్న మోడీ ఆలోచన నిజంగా అద్భుతమే. ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ కూడా అప్పుడప్పుడు పక్కదారి పట్టినా అపర మేధావి ప్రజ్ఞను మాత్రం పార్టీలకు అతీతంగా అంతా ప్రశంసించారు.

చివరగా మాట్లాడిన మోడీ.. అంబేద్కర్ దార్శినికతను అద్భుతంగా కొనియాడారు. దళిత బిడ్డ అయిన అంబేద్కర్‌.. జీవితం ప్రతి దశలో ఎన్నో అవమానాలకు గురయ్యారు. కానీ, దేశ భవిష్యత్తును నిర్మించే అవకాశం వచ్చినప్పుడు.. మాత్రం ఆయన ప్రతీకార ధోరణి చూపలేదు. మనలాంటివాడై ఉంటే దేశంపై శత్రుత్వం చూపేవాడు. కానీ, విషాన్నంతా తాను మింగి.. మనకు అమృతం మిగిల్చాడంటూ అద్భుతంగా కీర్తించారు మోడీ.

వైవిధ్య భరిత భారతంలో రాజ్యాంగ రచన అత్యంత కష్టమైన ప్రక్రియ అనీ.. అంతటి క్లిష్టమైన బాధ్యతను అంబేద్కర్ అత్యంత ప్రతిభతో నిర్వహించారని మోదీ ప్రశంసించారు. ఆద్యంతం సుదీర్ఘంగా, ఉద్వేగభరితంగా ప్రసంగించిన మోడీ.. పలుసార్లు సభ్యుల హర్షద్వానాలు అందుకున్నారు. పలు సంస్కృత కీర్తనలను తన ప్రసంగంలో అలవోకగా ప్రస్తావిస్తూ చారిత్రక ప్రసంగం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: