హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పుంజుకుందని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అతి ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారా? అయితే మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. భాగ్యనగరంలోని హైటెక్ సిటీ సమీపంలో రాయదుర్గ్ ప్రాంతంలో ఇటీవల ఎకరం భూమి ధర రూ.30 కోట్లకు పలికిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని తమ ఘనతగా చెప్పుకుంటూ భారీ ప్రచారం మొదలెట్టేసింది.

 

కానీ వాస్తవం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం నగరం నలుమూలల్లోని ప్రభుత్వ భూములను ఇ-వేలం ద్వారా అమ్మి డబ్బులు సంపాదించాలని చేసిన ప్రయత్నాలు ఒక్క రాయదుర్గ్ ప్రాంతంలో మాత్రమే ఫలించాయి కానీ తక్కిన ప్రాంతాల్లో కనీస అంచనా స్థాయికి కూడా అవి అందుకోలేదని గణాంకాలు ససాక్ష్యంగా చూపిస్తున్నాయి.

 

హైటెక్ సిటీకి సన్నిహితంగా ఉండే మణికొండ, కోకాపేట్ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ తలపెట్టిన భూముల వేలం మార్కెట్ ధర కంటే తక్కువకే పలుకున్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాయదుర్గలో ఎకరం భూమి రూ.30 కోట్లకు పలికిందనే వార్తను ప్రముఖంగా చూపిస్తూ నగరం మొత్తంలో రియల్ ఎస్టేట్‌ మళ్లీ పుంజుకొందని ప్రచారం చేసుకుంటోంది.

 

ఉదాహరణకు మణికొండ, కోకాపేట్ ప్రాంతాల్లో మార్కెట్ రేటు చదరవు గజానికి రూ. 40 వేలు పలుకుతుండగా వేలంలో 25 వేల రూపాయల వద్దే పాట నిలిచిపోయింది. కానీ రాయదుర్గలో పెరిగిన ధరలను చూపి తెరాస ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రచారానికి లంకించుకుంది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 17 చోట్ల, హైదరాబాద్‌లో పది చోట్ల భూమిని అమ్మకానికి పెట్టింది కానీ రంగారెడ్డి జిల్లాలో  హైటెక్ సిటీ సమీపంలో మాత్రమే కొనుగోలు అవుతుండగా, హైదరాబాద్ జిల్లాలోని భూములను కొనే నాధుడే కనిపించడం లేదని సమాచారం.

 

చివరకు నగరంలోనే సంపన్న ప్రాంతాలుగా గుర్తింపుపొందిన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో కూడా 3.5 ఎకరాల భూభాగాలను అమ్మడానికి సిద్ధపడినా వాటిని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మళ్లీ రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుతోందని తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికి దిగటం జనాలను పక్కదోవలు పట్టించడం కోసమే కదా అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: