గత కొంత కొలంగా వస్తువులు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై అధికార పక్షం, ప్రతిపక్షానికి రగడ కొనసాగుతూనే ఉంది... ఎట్టకేలకు ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకపోయినా.. జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రధాని శుక్రవారం రాత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లతో సమావేశమై జీఎస్‌టీ బిల్లుపై చర్చించారు.

మోదీ ఆహ్వానంతో ప్రధాని నివాసానికి చేరుకున్న సోనియా, మన్మోహన్‌లు ఆయనతో దాదాపు 45 నిమిషాల పాటు ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఈ 'ఛాయ్ పే చర్చా' కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలకమైన జీఎస్‌టీ బిల్లు సహా 36 బిల్లులు సభ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానానికి ఉద్దేశించిన జీఎస్‌టీ గరిష్ట పరిమితి 18 శాతమే ఉండాలని.. రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తువులపై అదనంగా ఒక శాతం పన్ను వద్దని, రాష్ట్రాలు తమ రెవిన్యూ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఐదేళ్లపాటు వాటికి వంద శాతం పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండడం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: