హైదరాబాదు నగరంలో తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో బలం పుష్కలంగానే ఉన్నదని సాధారణంగా అంచనాలు నడుస్తూ ఉంటాయి. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి, తెరాసలో చేరిపోయిన వారు కూడా రాజీనామాలు చేయకపోవడానికి తిరిగి ఎన్నికల క్షేత్రానికి అంత త్వరగా వెళ్లే ధైర్యం లేకపోవడమే కారణం అని పలువురు అంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ.. నిన్నటి పరిస్థితులు లేదా ప్రస్తుత అంచనాల ప్రకారం.. భాగ్యనగరంలో తెరాసకంటె తెదేపా పరిస్థితి మెరుగ్గా ఉన్నదనే ఎవరైనా అంటారు. అయితే రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో తెదేపాకు ఉండే ఓట్లకు గండికొట్టడానికి వైకాపా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. 


తెలంగాణలో నామమాత్రపు అస్తిత్వం కూడా లేని, వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నికల్లో గెలుస్తాం అనే ప్రగల్భాలతో రంగంలోకి దిగి.. కనీసం నాలుగోస్థానంలో కూడా నిలవలేకపోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. గ్రేటర్‌ ఎన్నికల్లో మాత్రం.. ఎవ్వరితోనూ పొత్తు లేకుండా అన్ని వార్డులకు పోటీచేస్తాం అంటూ ప్రకటిస్తూ ఉండడం. తెలుగుదేశానికి ఉండే ఓట్లకు గండికొట్టడానికే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విమర్శను వైకాపా వరంగల్ ఎన్నిక సమయంలో కూడా ఎదుర్కొన్నది. తొలినుంచి కేసీఆర్ వేసే స్కెచ్ ల ప్రకారమే జగన్ నడుస్తూ ఉంటారని తొలినుంచి తెదేపా బాగా ప్రచారం చేయడం వలన వచ్చిన ప్రభావం అది. అయితే వరంగల్ ఎన్నిక విషయంలో ఆ ప్రచారం తప్పని తేలింది. వైకాపా పొందగలిగిన ఓట్లు చాలా నామమాత్రంగానే ఉన్నాయి. కానీ ఆంధ్రాప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉండే హైదరాబాదు నగరంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉండవచ్చు. మరి ఇక్కడ కూడా అదే ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. 


మరోవైపు ఈ నిర్ణయం పట్ల సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పైకి అన్ని వార్డుల్లోనూ పోటీచేసేస్తాం అంటున్నారు గానీ.. కొన్ని ప్రాంతాల్లో తప్ప..కనీసం కేండిడేట్లు అయినా దొరుకుతారా? అనేది ప్రశ్నార్థకం అని వారే ప్రెవేటు సంభాషణల్లో అంటున్నారు. ఇదంతా కూడా కేసీఆర్‌ పార్టీ విజయావకాశాలను మెరుగు పరచడానికి జగన్‌ అందిస్తున్న చేయూత కింద కొట్టిపారేస్తున్నవారు కూడా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: