పరిపాలనాదక్షుడుగా చంద్రబాబుకు చాలా మంచి పేరుంది. కాలం కలసిరాలేదు కానీ లేకపోతే 2000-04 మధ్యలోనే ఏపీని అగ్ర రాష్ట్రంగా నిలిపేవాడని గతంలో కథనాలు వచ్చాయి. టెక్నాలజీని వాడటంలోనూ.. గుడ్ గవర్సెన్స్ ప్రాక్టీసెస్ ప్రారంభించడంలోనూ బాబు ట్రాక్ రికార్డు బాగానే ఉంది. కానీ అదే పాలనాచంద్రుడిలో కొన్ని మచ్చలూ ఉన్నాయి. ఇచ్చిన హామీలను అటకెక్కించిన దాఖలాలూ ఉన్నాయి. 

వాటిలో మద్య నిషేధం ఒకటి. గతంలో ఎన్టీఆర్ హయాంలోనే మధ్య నిషేధం హామీని ఎన్నికల్లో వచ్చింది. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేశారు. అప్పట్లో అదో విప్లవం. కాస్తో కూస్తో అమల్లో విఫలమైనా చాలా జీవితాలు బాగుపడ్డాయి. కానీ మద్య నిషేధం అమల్లో విఫలమైందని.. సర్కారు ఆదాయం కోల్పోతోందని చంద్రబాబు అధికారంలోకి వచ్చేశాక ఆ మద్య నిషేధం ఎత్తేశారు. 

లేటెస్టుగా మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. సర్కారు అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ అధికారులతోనే మద్యం అమ్మిస్తున్నారు. ఇప్పుడు మద్యం ఆదాయం లేకుండా ప్రభుత్వం నడవలేని పరిస్థితి. ఏపీయే కాదు.. మిగిలిన రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. కానీ ఇలాంటి సమయంలో బీహార్ సర్కారు సాహసోపేత నిర్ణయం తీసుకునే ఆలోచనే చేస్తోంది. 

మద్య నిషేదాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆలోచిస్తున్నారు. 2016 ఏప్రిల్ ఒకటి నుంచి మద్య నిషేదాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం గుజరాత్ లో మాత్రమే మద్య నిషేధం ఉంది. మరి ఈ సమయంలో చంద్రబాబు తన పాత హామీ గురించి పునరాలోచిస్తారా.. ఏమో.. మద్య నిషేధం వల్ల సర్కారు ఆదాయం కోల్పోవడం నిజమే. 

కానీ ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపుతూ వచ్చే ఆదాయాన్ని మళ్లీ అవే కుటుంబాల కోసం వెచ్చించడం వల్ల ఏం ఉపయోగం. అన్నీ సవ్యంగా ఉండి తాగేవాళ్ల సంగతి సరే. కానీ ఎందరో బడుగు జీవుల కాపురాల్లో మద్యం నిత్యం మంటలు రేపుతున్న సంగతి వాస్తవం కాదా.. ఆ జీవితాల్లో వెలుగులు నింపడం సర్కారు బాధ్యత కాదా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: