రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం చాలా ఈజీ.. ముఖ్యంగా వాళ్ల సొంత ప్రాంతాలకు వారు చేసే సేవలపై బండలేయడం ఇంకా చాలా ఈజీ.. ఎందుకంటే.. సదరు నాయకుడు సొంత ప్రాంతానికి ఎక్కవగా సేవ చేస్తే.. అదిగో ఆ రాజకీయ నాయకుడికి సొంత ప్రాంతం తప్ప వేరే ఇంకా ఏమీ పట్టవు. అన్నీ ఆయన సొంత ప్రాంతానికే చేసుకుంటున్నాడని విమర్శిస్తారు. 

అదే నాయకుడు సొంత ప్రాంతాన్ని పట్టించుకోకపోతే.. సొంత ప్రాంతాన్నే పట్టించుకోని వాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడని మండిపడతారు. ఇక మన రాజకీయ నాయకుల విషయాన్ని పరిశీలిస్తే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. వైఎస్సార్ కడప జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తే అంతా సొంత జిల్లాకే చేసుకుంటున్నాడని విమర్శలు వచ్చాయి. 

వైఎస్ కూడా విమర్శలకు తగినట్టుగానే పనులు చేశారు. కడపకు ఔటర్ రింగు రోడ్డు, సొంత అడ్డా ఇడుపులపాయలో ఏకంగా ట్రిపుల్ ఐటీ పెట్టించుకున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే సామెతను తలపింపజేశారు. అయితే అలాంటి విమర్శలను వైఎస్ ఏనాడూ ఏమాత్రం పట్టించుకోలేదనుకోండి అది వేరే విషయం.. ఇప్పుడు చంద్రబాబుపై అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. 

కాకపోతే.. చంద్రబాబు సొంత జిల్లాకు ఏమీ చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు.. ఏమీ చేయకపోగా.. వచ్చే వాటిని కూడా రాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అందుకు ఉదాహరణగా  సాగునీటి పథకాన్ని చూపిస్తున్నారు. విషయం ఏంటంటే.. చిత్తూరు జిల్లాకు నీటిని సరఫరా  చేసేందుకు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ పథకాన్ని మంజూరు చేశారు. 

అది పూర్తిగా పట్టాలు ఎక్కక ముందే కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయారు. చంద్రబాబు దాన్ని కార్యరూపం దాల్చేందుకు సహాయ పడకుండా.. ఏకంగా దాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ మండిపడుతున్నారు. గత ప్రభుత్వం 7390 కోట్ల రూపాయలను కేటాయించిందని.. అలాంటి పథకాన్ని ఇప్పుడు రద్దు చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. చంద్రబాబు ఈ విధంగా రాయలసీమను.. అందులోనూ సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: