తాము అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా దోచుకోవడం మీద తప్ప వారికి మరో అంశం మీద దృష్టి ఆనినట్లుగా లేదు. ఇప్పుడు హఠాత్తుగా పేదలు, బడుగులు, బీసీలు, వారికోసం పాటుపడిన మహనీయులు, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత, ఆవశ్యకత ఇత్యాది అంశాల మీద ధ్యాస పుట్టినట్లుగా కనిపిస్తోంది. అవును మరి.. పదేళ్లపాటూ కేంద్రంలో తమ సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. అంత కాలంపాటూ తాను కూడా పదవిని వెలగబెడుతూనే ఉన్నప్పటికీ.. ఎన్నడూ ఒక డిమాండ్‌ చేసి ఎరగని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీ హనుమంతరావుకు, బీసీల కోసం పాటుపడిన జ్యోతిరావు ఫూలే మీద ఇప్పుడు హఠాత్తుగా ప్రేమాభిమానాలు పొంగుకొస్తున్నాయి. ఫూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. 


జ్యోతిరావు ఫూలే వంటి మహనీయులు బడుగుల బాగు కోసం తమ జీవితాలను అర్పించి.. పాటుపడ్డారనే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. వారిని స్మరించుకోవడాన్ని గురించి కూడా ఈ జాతి ఎన్నడూ మరచిపోలేదు. అయితే కేంద్రం తరఫున అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం అనేది చాలా కొద్ది మంది జాతీయ నాయకులకు మాత్రమే పరిమితం అయి ఉన్న నేపథ్యంలో ఈ కొత్త డిమాండు చర్చకు దారితీసేదే. కొత్త డిమాండుకు సంబంధించిన చర్చను పక్కన పెడితే.. అసలు... ఫూలే మీద ఇవాళ మాత్రం ఇంత ప్రేమాభిమానాలను కురిపిస్తున్న వీహెచ్‌ వంటి నాయకులు తమ పార్టీ అధికారంలో ఉండగా ఏం చేస్తున్నారన్నది. ఆలోచించాల్సిన అంశం. 


కాంగ్రెస్‌ పార్టీ నిరాటంకంగా పదేళ్లు ఏలుబడి సాగించింది. ఈ పదేళ్లలో ఎన్నో కుంభకోణాల్లో ఇరుక్కుంది. ఈ పదేళ్లు కూడా ఫూలే జయంతులు వచ్చాయి, వెళ్లాయి. ఆయన మీద భక్తి ప్రపత్తులు ఉన్న నాయకులు.. నివాళి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ వీహెచ్‌కు ఇన్నాళ్లలో ఎన్నడూ ఫూలే జయంతిని తమ చేతిలో ఉన్న యూపీఏ సర్కారు ద్వారా అధికారికంగా నిర్వహింపజేయాలనే ఆలోచన కలిగినట్లు లేదు. లేదా.. నెహ్రూ ఇందిరాల భజన తప్ప ... యూపీఏ సర్కారు హయాంలో తన నోటమ్మట మరొకరిని కీర్తించకూడదని ఆయన ఒట్టుపెట్టుకున్నారేమో.. యూపీఏ దిగిపోయిక పూలే జయంతిని అధికారికంగా చేయడం గురించి మాట్లాడుతున్నారని జనం వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: