aస్థానిక సంస్థల కోటాలో 12 మంది ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణలో ఎన్నికలు జరగబోతుండగా.. ఒకటి రెండు స్థానాల మీద ఆశలున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ముందే చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీచేసినా విజయం దక్కదు. పోటీచేయకపోతే పరువు దక్కదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కున్న కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నాయకుడు ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ బేరసారాలకు అవకాశం లేకుండా.. వీటిని ఏకగ్రీవం చేయడానికి అధికార తెరాస చొరవ తీసుకుంటే గనుక.. తాము కూడా సహకరిస్తాం అని చిలకపలుకులు పలుకుతున్నారు. 


నిజానికి ఏకగ్రీవం అయినా కాకపోయినా.. మెజారిటీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికే ఆధిక్యం ఉంది. ఖచ్చితంగా వారే గెలుపొందడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఒకటి రెండు స్థానాల్లో మాత్రం.. కాంగ్రెసు పార్టీకి అంతో ఇంతో పోటీచేయడానికి సరిపడా బలం ఉంది. రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో రెండో ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని రంగంలో ఉంచాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అక్కడైనా ఫలితాలు తమకు సానుకూలంగా వస్తాయో బెడిసికొడతాయో ననే భయం వారిలో పుష్కలంగా ఉన్నట్లుంది. 


అందుకే కాబోలు ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసేసేద్దాం అనే ప్రతిపాదన తెస్తున్నారు. నిజానికి ఎంతో సీనియర్‌ నేత అయిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే మాట మారుస్తున్నట్లు లెక్క. ఎందుకంటే.. కేవలం రెండు రోజుల కిందట ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అయినా సరే.. భాజపాతో కూడా చేతులు కలిపి అయినా సరే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను గెలుచుకోవడం గురించి మాట్లాడారు. అయితే అంతలోనే మాట మార్చారు. ఇప్పుడు ఏకగ్రీవం చేయడానికి తెరాసకు రాజీసూత్రం ప్రతిపాదిస్తున్న ధోరణిలో ఉన్నారు. ఈ ఎన్నికల షెడ్యూలు వచ్చేలోగా ఇంకెన్ని రకాలుగా మాట మారుస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: