సీమాంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివి. దే్న్ని పోగొట్టుకున్నా నాకు బాధే అంటూ నటించిన చంద్రబాబు సీమాంధ్రలో అధికారం చేజిక్కించుకుని నిశ్చితంగా ఉన్నారు. ఏపీ ప్రజల సెగ అంటూ తగిలితే అది మూడున్నర సంవత్సరాల తర్వాతే చంద్రబాబు నెత్తిన పడుతుంది. కానీ తెలంగాణను వదులుకోలేక, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తనకున్న పట్టును నిలుపుకోలేక సతమతమవుతున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బొక్క బొర్లా పడిన తర్వాత కూడా ఇంకా సరైన తోవకు రాలేకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 


ఒకవైపు ఏపీ జిల్లాలు వరద భీబత్సానికి గురై నానా అగచాట్లూ పడుతుంటే అక్కడి ప్రజలను నిర్లక్ష్యం చేసి వరంగల్‌లో నాలుగు రోజులపాటు ఏకధాటిగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైకాపా అధినేత అంత కష్టపడీ ఫలితం లేకుండా పోయింది. కేవలం 25 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్న జగన్ పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది. పైగా ఉప ఎన్నికలో తలపడటం ద్వారా జగన్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోనుందని పరిశీలకుల అబిప్రాయం. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తొడుగుగానే కష్టించి పని చేస్తున్నారని తెలంగాణ లోని సెటిలర్ల ఓట్లను చీల్చవలసిన అవసరం కేసీఆర్‌కి ఎప్పుడు వచ్చినా జగన్ ఆయనకు ఆదుకుంటున్నారని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇప్పుడు నమ్ముతున్నారు. 


ఈ నేపథ్యంలో పార్టీ నిండా మునుగుతోందని భయపడుతున్న వైకాపా నేతలు తెలంగాణను ఇకనైనా వదిలి ఏపీ రాజకీయాల్లో పూర్తిగా కేంద్రీకరించి పనిచేయాలని జగన్‌కు సూచించారని సమాచారం. కాని తనకయితే అలాంటి ఆలోచన ఇప్పటికయితే లేదని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో వైకాపా తప్పక పోటీ చేస్తుందని జగన్ వారికి నొక్కి చెబుతున్నారని తెలిసింది. ఈ విషయంలో జగన్ లెక్కలు జగన్‌కు ఉన్నట్లున్నాయి. జీహెచ్ఎంసీలో పలు వార్డులను పైకాపా గెల్చుకుంటుందని, హైదరాబాద్‌లోని సీమాంధ్ర సెటిలర్లు తప్పకుండా పార్టీకి సహకరించి ఓటు వేస్తారని జగన్ బలంగా నమ్ముతున్నట్లున్నారు.


ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొంటున్నందున హైదరాబాద్ మేయర్ ఎవరన్నది నిర్ణయించడంలో వైకాపాయే కింగ్ మేకర్ అవుతుందని జగన్ తనను కలిసిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నారని సమాచారం. కాని వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా వైకాపాకు కరువవుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కేసీఆర్ తరపున సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు చీల్చడానికి జగన్ మరోసారి తురుపుముక్కలా మారుతున్నారా అనేది సందేహం.


మరింత సమాచారం తెలుసుకోండి: