వరంగల్ ఉప ఎన్నికల విజయ గర్వం నుంచి తెరాస శ్రేణులు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి. వరంగల్‌ ఉప ఎన్నికల్లో నాలుగున్నర లక్షల మెజారిటీతో గెలుపొందడం అపూర్వమనే చెప్పాలి కానీ, ఆ విజయ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలపై ఏమాత్రం ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెరాస పప్పులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉడకవు గాక ఉడకవు. ఈ విషయం బాగా ఆర్థమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సక్సెస్ ఫార్ములాను అరువుకు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.


జీహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్‌ ప్రతి సందర్భంలోనూ ఎంఐఎం పార్టీని తురుపుముక్కలా వాడుకున్నారు. ఈ సూత్రం ప్రకారం కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికలకు ముందు ఘర్షణ వాతావరణం సృష్టించి స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు నటించేవి. కానీ ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పోటీలో నిలిపేది. అంటే కాంగ్రెస్ ఓట్లు ఇతర పార్టీలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ పథకం రూపొందించేవారు.


ఫలితంగా ఎంఐఎం పార్టీ మెజారిటీ సీట్లను గెల్చుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కి మద్దతిచ్చేది. వీరిమధ్య పోలింగ్‌కు ముందట ఎలాంటి పొత్తూ ఉండేది కాదు కనుక, విద్యావంతులైనవారి, హిందువుల ఓట్లు బీజీపేకి పడేవి కావు. జీహెచ్ఎంసీ మేయర్ సీటును గెల్చుకోవడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే ఫార్ములా అవలంబించి పథక రచన చేస్తున్నారని వినికిడి. ప్రశ్న అల్లా ఏదంటే ఎంఐఎంకి దక్కగా మిగిలిన వార్డులలో తెరాస మెజారిటీ స్థానాలు గెల్చుకోగలదా అన్నదే. 


అయితే ఈ విజయ ఫార్ములాలో భాగంగా తెరాస, ఎంఐఎమ్ పార్టీలు మెట్రో రైల్ మార్గ మార్పిడీ సమస్యపై ఘర్షిస్తున్నట్లు నటిస్తున్నాయి. జనవరి చివరి నాటికి జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిపోతాయి. కార్పొరేషన్‌లో నేటివరకు తెరాసకు ఒక్కరంటే ఒక్క ప్రతినిధీ కూడా లేరు. ఈ మధ్యే కొంతమంది జంప్ జిలానీలు తెరాసలో చేరారంతే. ఇక ప్రతిపక్షాలైతే ఈ ఎన్నికలు తమ చిట్టచివరి ఎన్నికలుగా భావిస్తూ మేయర్ సీటును గెల్చుకునేందుకు గరిష్టంగా ప్రయత్నాలు ప్రారంభించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: