త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే వరంగల్  ఉపఎన్నికల్లో బ్రహ్మాండమైన సక్సస్ చవి చూసిన గులాబీ పార్టీ అదే తరహా మ్యాజిక్ హైదరాబాద్ లో రిపీట్ చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ అదంత ఈజీ కాదన్న సంగతి గులాబీ సేనకు కూడా బాగా తెలిసిన విషయమే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలంటే ఎన్నో సమీకరణాల్లో పై చేయి సాధించాలి. 

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సెటిలర్లు నిర్ణాయక పాత్ర పోషిస్తారు. వారిని ఆకట్టుకోవాలి. టీడీపీని కట్టడి చేయాలి.. లేదా టీడీపీ నాయకులను తమ వైపుకు తిప్పుకోవాలి. ఐతే.. గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తారని టీడీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారన్న పేరు ఎప్పటి నుంచో ఉంది. అందుకే చంద్రబాబును నిరోధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందట. 

అందుకే గ్రేటర్ ఎన్నికలు ముందున్న సమయంలో ఓటుకు నోటు అస్త్రాన్ని బయటకు తీస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఒక హాట్ కామెంట్ విసిరారు. చంద్రబాబు మూడు నెలల తర్వాత హైదరాబాద్ కు ఎందుకు వచ్చారో అందరికి తెలుసునని.. బాబు ట్రిక్కులు సామాన్యులకు కూడా అర్దం అవుతాయని నాయిని అన్నారు. 

చంద్రబాబు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆయన కు ధన్యవాదాలు చెబుతామన్నారు నాయని. ఓటుకు నోటు కేసు పెండింగులో ఉన్న సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకుని ప్రచారం చేయడం మంచిదేనని నాయిని అన్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో తమకు ఏమి చేయాలో తెలుసునని.. పోలీసులు వారి పని వారు చేస్తారని నాయిని కామెంట్ చేశారు. నాయిని ప్రకటన చంద్రబాబును పరోక్షంగా హెచ్చరించడమేనంటున్నారు పొలిటికల్ పండిట్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: