పాపం చాలా రోజుల తర్వాత సినీ నటి రోజా మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు దాదాపు 15శాతం అభివృద్ధి సాధించాలని అధికారుల సమీక్షలో చెప్పడాన్ని తప్పుబడుతూ సుదీర్ఘ ప్రసంగమే చేశారు. అసలు  15 శాతం అభివృద్ధి అంటే మాటలు కాదని.. మన దేశం అత్యధికంగా 9-10 శాతం అభివృద్ధి అదీ వాజ్ పేయ్ హయాంలో జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 7-8 శాతం అభివృద్దే రికార్డని.. చంద్రబాబు గొప్పలకు పోయి 15 శాతం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని రోజా మండిపడ్డారు. 



అక్కడితో ఆగారా.. ఆంధ్రా సీఎం ను పట్టుకుని పోలిగాడితో పోల్చేశారు. బొంకరా...బొంకరా పోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయలంత..అంటూ సామెతలు చెప్పి మరీ బాబును విమర్శించింది. మరి చంద్రబాబును అంతగా తిడితే దేశ భక్తులు ఊరుకుంటారా.. ఏ మాత్రం ఊరుకోరు.. అందులోనూ ఇష్యూ అభివృద్ధి. అభివృద్ధికి మారు పేరు ఏంటంటే చంద్రబాబే అని గాఢంగా నమ్ముతారు మన దేశ భక్తులు.



అందుకే.. అభివృద్ధిపై రోజా విమర్శలపై వెంటనే అంతే ఘాటుగా స్పందించారు. రోజా సొంత జిల్లాకు చెందిన... రోజా చేతిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడే ఈ సాహసానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. అసలు  రోజాకు జీడీపీ అంటే ఏమిటో అర్దం తెలుసా అని ఏకంగా ఆమె గాలి తీసే ప్రయత్నం చేశారు. ప్రపంచంలో 15 శాతం అభివృద్ధిలేదని రోజా చెప్పడాన్ని గాలి తప్పుబట్టారు. 


ప్రపంచంలో ఎన్నో దేశాలు డబుల్ డిజిట్ వృద్ది రేటు కలిగి ఉన్నాయని గాలి ముద్దుకృష్ణమనాయుడు వివరించారు. ఊరికే గాలి మాటలు కాకుండా ఆయన ఉదాహరణకు కూడా చూపించారు.  సౌత్ సూడాన్, టర్కీ, మంగోలియా, తుర్కిమినిస్తాన్ వంటి దేశాలు డబుల్ డిజిట్ సాధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రోజా అహంకారంతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు గాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: