మరో ఆసక్తికరమైన చర్చకు చంద్రబాబు సర్కారు తెర తీసింది. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై కమిషన్ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబు చర్యతో కాపుల్లో మళ్లీ రిజర్వేషన్ ఆశలు మొలకెత్తుతున్నాయి. అయితే అసలు కాపులకు రిజర్వేషన్ సాధ్యమయ్యే పనేనా.. గతంలో ఈ దిశగా జరిగిన ప్రయత్నాలు విఫలమైన సంగతి వాస్తవం కాదా.. చంద్రబాబు చిత్తశుద్ధితోనే ఈ అంశాన్ని తెర పైకి తెచ్చారా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి.

గతంలో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కూడా కాపులను బీసీల్లో చేర్చేందుకు విఫలప్రయత్నం చేశారు. ఒకవేళ చంద్రబాబు చిత్తశుద్దితో ఆ పని చేపట్టినా అదో సుదీర్ఘ ప్రక్రియ.. అది ఓ కొలిక్కిరావాలంటే మళ్లీ ఎన్నికల సమయం వస్తుంది. ఇదిగో ఇంత కసరత్తు చేశాం.. వచ్చే ఎన్నికల్లో గెలిపించండి.. రిజర్వేషన్ సాధిస్తాం అని చంద్రబాబు దీన్ని ఎన్నికల హామీగా మరోసారి ప్రయోగించవచ్చు. అయితే కాపులకు రిజర్వేషన్ అంశాన్ని ఇప్పటికే బీసీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. 

కాపులకు రిజర్వేషన్ అంశానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడతామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య చెప్పారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యే కూడా.. అయినా చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లు ఇచ్చుకుంటూపోతే భవిష్యత్తుల్లో ప్రతి కులం కూడా తమనూ బీసీల్లో చేర్చాలంటూ డిమాండ్ చేస్తుందని కృష్ణయ్య అంటున్నారు. 

గతంలో కాపులకు రిజర్వేషన్ కల్పించినప్పుడు బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు కాపు రిజర్వేషన్లు చెల్లదని తీర్పు చెప్పింది. ఇప్పుడు కూడా అలా జరగకుండా  చంద్రబాబు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే కాపులను బీసీల్లో చేర్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని కొందరు చెబుతున్నారు. అది సాధ్యమవుతుందా..? అసలు ఎవరికీ నష్టం కలగని రీతిలో కాపులకు రిజర్వేషన్ కల్పించడం సాధ్యమయ్యే పనేనా..? సాధ్యం కాదని తెలిసి కూడా ఓట్ల కోసమే బాబు కాపులను వంచిస్తున్నారా..? కాపులకు రిజర్వేషన్ అంశంలో ఇలాంటి సమాధానంలేని ప్రశ్నలే ఎక్కువ.


మరింత సమాచారం తెలుసుకోండి: