కిక్కిరిసిన రైలులోంచి కిందికి దిగటానికో, లేక రైలులోకి ఎక్కడానికే సహాయం కావాల్సివస్తే మనమైతే ఎవరిని అడుగుతాం. మహా అయితే తోటి ప్రయాణీకులనో లేదా మన స్నేహితులనో అడుగుతాం. అదీ సాధ్యం కాకపోతే పక్కనే ఉన్న పోర్టర్ సహాయం తీసుకుంటాం. కానీ ఒక తండ్రిని రైలులోంచి దింపడంలో కాస్త సహాయం చేయమంటూ ఒక కుమారుడు నేరుగా రైల్వే మంత్రికే ట్వీట్ చేసేశాడు. 


కన్నతండ్రికి కాస్త సహాయం చేయమంటూ పంపిన ఆ ట్వీట్‌కి ఇండియన్ రైల్వేనే కదిలిపోయింది. సగౌరవంగా ఆ తండ్రిని బోగీలోంచి దింపడానికి అంత పెద్ద రైలే షెడ్యూల్ టైమ్‌ని కూడా మర్చిపోయి నిలబడిపోయింది. ఇది ట్వీట్ మహిమో. ప్రయాణీకుల అభ్యర్థనలు అంత విలువ ఇచ్చిన ఆ రైల్వే పెద్దల సంస్కారమో తెలియదు కానీ ఆ కుటుంబం ఆ రైల్వేని ఎన్నడూ మర్చిపోలేనంత మధుర జ్ఞాపకాలను అందించి మరీ ఆ రైలు ముందుకు కదిలింది. ఏ పాశ్చాత్య దేశంలోనూ ఇదంతా జరిగిందని అనుకుంటున్నారు కదూ. మన ఇండియాలోనే జరిగిందింది.


వివరాల్లోకి వెళితే వ్యాధిగ్రస్తుడైన తన తండ్రిని రైలులోంచి కిందికి దించడంలో కాస్త సహాయం చేయవలసిందిగా కోరుతూ రాజస్థాన్‌కు చెందిన వాణిజ్యవేత్త పంకజ్ జైన్ రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభుకి ట్వీట్ చేశారు. కర్నాటకలో స్థిరపడిన జైన్ కుటుంబం రాజస్థాన్‌కి ప్రయాణమై వెళుతున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. యశ్వంతపూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో వెళుతున్న ఆ కుటుంబ తమ గమ్యస్థానమైన మెట్రా రోడ్ రైల్వే స్టేషన్లో దిగడానికి ఒక సమస్య అడ్డు వచ్చింది. కేవలం అయిదు నిమిషాలు మాత్రమే ఆగే ఆ రైల్లోంచి లగేజీతో సహా వ్యాధిగ్రస్తుడయిన తండ్రిని దింపుకోవటం చాలా కష్టమని గ్రహించిన జైన్ నేరుగా రైల్వే మంత్రి సురేష్ ప్రభుకే ట్వీట్ చేసి సహాయం చేయమని అడిగారు. ట్వీట్ చేశారే  కానీ ఎవరు స్పందిస్తారులే అని ఉండిపోయిన ఆ కుమారుడికి షాక్ కలిగిస్తూ యావత్ రైల్వే ఆ కుటుంబం ముంగిటికి వచ్చింది. 
నా కోచ్ లోంచి అయిదు నిమిషాల లోపే లగేజీని, తల్లిదండ్రులను, చెల్లెలిని ఎలా దింపుకోవడం అని ఆందోళన చెందాను. ఇండియన్ రైల్వేస్‌కి ట్వీట్ చేయవలసిందిగా స్నేహితులు ఇచ్చిన సలహా పాటించాను. అయిదు నిమిషాల్లోపే ఇండియన్ రైల్వేస్ ప్రభు కుటుంబంతో కనెక్ట్ అయింది. వారు ప్రయాణిస్తున్న కోచ్ నంబర్, పిఎన్ఆర్ నంబర్‌ను పంపించవలసిందిగా కోరింది. పంపిన వెంటనే మీరు ఎలాంటి సమస్యా ఎదురుకాదంటూ రైల్వేస్ నుంచి సందేశం కూడా వచ్చిందని జైన్ సంతోషంతో ఈ వార్తను పంచుకున్నారు. 

ఇంకా ఆశ్చర్యపడాల్సింది ఏమిటంటే ఒక రైల్వే అెదికారి జైన్‌ను కలిసి వారు దిగవలసిన మెర్తా రోడ్ స్టేషన్‌లో సహాయం వారికోసం ఎదురు చూస్తోందని సమాచారమిచ్చారు కూడా. వారు గమ్య స్థానం సమీపించగానే ఆ కుటుంబం తన కళ్లముందు జరుగుతున్నది చూసి నమ్మలేకపోయింది. మెర్తా రైల్వే స్టేషన్ మాష్టర్, అక పోర్టర్, ఇతర సిబ్బంది తమకోసం వీల్ చైర్‌తో సహా వచ్చి వేచి ఉన్నారని జైన్ చెమర్చిన కళ్లతో వివరించారు. 
వ్యాధిగ్రస్తుడైన తండ్రిని సహాయం చేయమని ఒక ట్వీట్ పంపితే అంత త్వరగా రాజస్థాన్ రైల్ స్టేషన్‌లో తమకు  సహాయాన్ని అందించడం నిజంగానే నమ్మలేకపోతున్నామని జైన్ చెప్పారు. 

ఎవరనుకన్నారు? మహా నిర్లక్ష్యానికి మారుపేరైన ఇండియన్ రైల్వేస్ ఇంత మంచి పని చేస్తుందని. ఒక కుటుంబం అడిగిన చిన్న సహాయానికి రైల్వే మంత్రి నుంచి మొదలుకుని మొత్తం రైల్వే యంత్రాంగమే కదిలి వస్తుందని. ఆ కుటుంబం ప్రదర్శిస్తున్న కృతజ్ఞతా భారం ఎంతో తెలుసా? ఇండియన్ రైల్వేస్ అంత..


మరింత సమాచారం తెలుసుకోండి: