కేసీఆర్ భోళా శంకరుడున్న ఆయన కూతురు కవిత మాట మరోసారి నిజమైంది. తెలంగాణలోని జర్నలిస్టులంతా చేతులెత్తి మొక్కేలా కేసీఆర్ వారిపై వరాల వర్షం కురిపించారు. ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్టులందరికీ నూటికి నూరు శాతం సర్కారు ఖర్చుతో ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతి జర్నలిస్టుకు సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని.. సమాజం కోసం పనిచేసే జర్నలిస్టుల కుటుంబాలకు ఇల్లు రూపంలో ఓ ఆస్తి మిగలాలనేది తన ఉద్దేశమని ముఖ్యమంత్రి చెప్పారు.

జర్నలిస్టులంటే ఎన్నో వర్గాలు ఉంటాయి. ప్రింట్, టీవీ, రిపోర్టర్స్, డెస్క్ జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్స్, కెమేరామెన్స్.. ఇలా అన్ని వర్గాల వారికీ సకల సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చెప్పారు. జర్నలిస్టులందరికీ ఒకేచోట ఇళ్ల నిర్మాణానికి దాదాపు వంద ఎకరాల స్థలం కేటాయిస్తామని.. పేదల కోసం కట్టే రెండు పడక గదుల ఇండ్లకు ఇచ్చే దానికి... అదనంగా నిధులు వెచ్చిస్తామని క్లారిటీ ఇచ్చారు. 

గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ టవర్లు, క్లబ్ హౌజ్, మార్కెట్, స్కూల్, ప్లే గ్రౌండ్, పార్కు, మల్టిప్లెక్స్ ఉండేలా అద్భుతమైన న్యూ టౌన్ నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతోపాటు జర్నలిస్టుల సంఘాల నేతలు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో ఈ హామీ ఇచ్చారు. 

ఊరికే హామీ ఇవ్వడం కాకుండా.. జర్నలిస్టు టౌన్ షిప్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అప్పటికప్పుడే  రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకూ ఆదేశాలిచ్చారు. అధికారులు, జర్నలిస్టు నాయకులు శనివారం నగరంలో పర్యటించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని కోరారు. స్థలం ఎంపిక చేసుకున్న వెంటనే మంచి లే ఔట్ రూపొందించి... మార్చిలోనే శంకుస్థాపన చేసి.. ఏడాదిలోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలనేది తన ఆలోచన అని సీఎం తెలిపారు. 

మొదటి దశలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పాత్రికేయుల టౌన్ షిప్పులు నిర్మిస్తామని.. ఆ తర్వాత దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల కోసం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు కేసీఆర్. నిధుల కొరత లేకుండా బడ్జెట్లోనే జర్నలిస్టుల ఇండ్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మాటల్లో ఉన్న పదును, వేగం చేతల్లో ఉంటే హైదరాబాద్ జర్నలిస్టులు నిజంగా కేసీఆర్ ఫోటో పట్టుకుని గృహ ప్రవేశం చేస్తారేమో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: