పవన్ కల్యాణ్ ఎవరు.. ఇంతకుముందెన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి అధినేత.. ఆయన కార్యకర్తలు ఎందరు.. అసలు కార్యకర్తల నమోదు వంటి కార్యక్రమం ఉందో లేదో కూడా తెలియదు. పోనీ మేనిఫెస్టో ఉందా..అలాంటివి ఉండవు. మరి ఇవేవీ లేనంత మాత్రాన పవర్ స్టార్ పొలిటికల్ పవర్ ఏమైనా తగ్గిందా.. అబ్బే అదేం లేదు. దటీజ్ పవన్ కల్యాణ్. 

ఆయన నేరుగా మోడీ దగ్గరకు వెళ్లగలరు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ పవన్ ను అక్కున చేర్చుకుంది. అంతేనా.. అంతేకాదు.. పవన్ వెనక ఉన్న అసలు ఫ్యాక్టర్ క్యాస్ట్ పాలిటిక్స్.. ఏపీలో అత్యధిక శాతం జనాభా ఉన్న సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పవన్ కల్యాణ్. సామాజిక బలంతో పాటు అభిమాన గణం కూడా పవన్ కు ప్లస్ పాయింట్.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అంటూ పోటీ ఇచ్చిన సమయంలో పవన్ ఇచ్చిన మద్దతే టీడీపీని అధికార పీఠం వైపు నడిపించిందంటారు ఎందరో విశ్లేషకులు. పవన్ సామాజిక వర్గం అండగా నిలవడం వల్లే టీడీపీ గట్టెక్కిందంటారు. ఎన్నికల తర్వాత అనేక విశ్లేషణల తర్వాత పవన్ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. 

కాపులు తనవైపు ఉండకపోయినా ఫరవాలేదు. అధికార పార్టీవైపు మాత్రం ఉండటానికి వీల్లేదు. కాపు సామాజిక వర్గంలో పవన్ హవా నడవటానికి వీల్లేదు.. ఇవీ జగన్ ముందున్న లక్ష్యాలు. ఆ సమయంలోనే కాపులను బీసీల్లో చేరుస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ తెరపైకి వచ్చింది. దాన్నే జగన్ అస్త్రంగా మలచుకున్నాడని విశ్లేషకులు చెబుతారు. 

ముద్రగడ వంటి వారిని తెరపైకి తెచ్చి ఉద్యమం చేయిస్తున్నది జగనే అంటారు కొందరు. దీనివల్ల కాపులు టీడీపీకి దూరమవుతారన్నది ఒక ఆలోచన. కాపుల్లో పవన్ కు ఉన్న పట్టు తగ్గేలా ముద్రగడ వంటి కాపు నాయకులు తెరపైకి వస్తారన్నది రెండో ఆలోచన. దీని ఫలితమే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు. కాపుల విషయంలో  పవన్ ను సైడ్ చేయడంలో జగన్ క్రమంగా సక్సస్ అవుతున్నారంటున్నారు విశ్లేషకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: