రిజర్వేషన్ కోసం తూర్పు గోదావరి జిల్లా తునిలో కొన్ని రోజుల క్రితం జరిగిన విధ్వంసం సూత్రధారి ఎవరో తెలిసిపోయిందట. ఇన్నాళ్లూ ఈ విధ్వంసం ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్ చేయించిందే అని వాదిస్తున్న టీడీపీ ఇప్పుడు నేరుగా ఆ నాయకుడి పేరు బయటపెట్టేసింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, జగన్ కు ఆప్తుడు అయిన భూమన కరుణాకర్ రెడ్డే ఈ విధ్వంసకాండకు ప్లాన్ చేశారని టీడీపీ తాజాగా ఆరోపిస్తోంది. 

తుని విధ్వంసం అప్పటికప్పుడు జరిగింది కాదని.. బాగా ప్లాన్డ్ గా జరిగిందేనని ఇప్పటికే ఓ అభిప్రాయం ఉంది. ఏకంగా రైళ్లను పూర్తిగా తగలబెట్టేసేంత వరకూ సీన్ వెళ్లిందంటే ఖచ్చితంగా ఇది ప్రీప్లాన్డ్ గా జరిగిందేనని పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే నీరుగా ఈ హింసకు వీళ్లే కారణం అని ఎవరినీ గుర్తు పట్టలేదు. ఉద్యమనాయకుడు కాబట్టి ముద్రగడపై కేసులు పెట్టారు. 

తుని విధ్వంసానికి ముందుగానే ప్లాన్ చేసిన జగన్ ఆ బాధ్యతను భూమన కరుణాకర్ రెడ్డికి అప్పగించారట. ఘటనకు పది రోజుల ముందే వైసీపీ నాయకుల బృందం తునిలో పర్యటించిందట. సభ ఎక్కడ జరగాలి. గొడవలు ఎక్కడ చేయాలి.. రైలు ఎలా తగలబెట్టాలి.. ఇలా ప్రతి ఒక్క అంశంపైనా క్లారిటీగా స్కెచ్ గీసుకున్నారట. ముందుగానే రెక్కీ కూడా నిర్వహించారట. 

ఈ విషయాలన్నీ టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ప్రెస్ మీట్లో బయటపెట్టారు. ఈ తుని విధ్వంసం విషయంపై తమపై అనవసరంగా బురద చల్లుతున్నారని వైసీపీ నేతలు ఇప్పటికే విమర్శిస్తున్నారు. అధికారం చేతిలో ఉంచుకుని సభను కంట్రోల్ చేయలేక.. ప్రజల దృష్టి మరల్చేందుకే తమను దోషులుగా చూపుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా భూమన పేరు బయటపెట్టారు. ఆయనేమంటారో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: