పవన్ అంటే పడిచచ్చిపోయే వాళ్లలో కాపు యువత ముందువరుసలో ఉంటారు. పవన్ అంటే వీరిలో చాలా మందికి పిచ్చిక్రేజ్. అయితే ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చిన కాపు రిజర్వేషన్ అంశం వారి పవన్ అభిమానంలో మార్పు తెస్తోందా.. ఈ అంశంలో పవన్ వ్యవహరించిన తీరు వారిలో ఆగ్రహం కలిగిస్తోందా.. ఇన్నాళ్లూ అభిమానించిన వారే ఇప్పుడు మండిపడుతున్నారా.. 

పరిస్థితి చూస్తే అలాగే ఉంది. తునిలో రైలు విధ్వంసం, పోలీస్ స్ఠేషన్ పై దాడి వంటి ఘటనల తర్వాత హడావిడిగా కేరళ నుంచి వచ్చి పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు. కాపు రిజర్వేషన్ అంశానికి మద్దతు ప్రకటిస్తాడని..ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు పవన్ చొరవ తీసుకుంటారని ఆయన కాపు అభిమానులు ఆశించారు. కానీ పవన్ అలాంటి పనేమీ చేయలేదు. 

దాదాపు చంద్రబాబు చెప్పిన మాటలే పవన్ కూడా వల్లె వేశారు. అంతేకాదు.. తాను కేవలం కాపులకే నేతను కానని విస్పష్టంగా చెప్పారు. దీంతో పవన్ పై కాపు అభిమానులు ఆగ్రహంగా ఉన్నారట. గోదావరి జిల్లాల్లో పవన్ ఫ్లెక్సీలను కొందరు అభిమానులే చించేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రేపల్లె మండలం ఉప్పూడి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం ప్రాంతాల్లో పవన్ ఫ్లెక్సీలను చించేశారట.

అయితే ఇదంతా పవన్ పై సాగుతున్న దుష్ప్రచారమే తప్ప వాస్తవం కాదని ఆయన అభిమానులు అంటున్నారు. పవన్ పై బురద చల్లేందుకు కొందరు కావాలనే పని గట్టుకుని ఆయన ఫ్లెక్సీలను చింపుతున్నారని చెబుతున్నారు. ఏదేమైనా మొన్నటి పరిణామంలో పవన్ వ్యవహించిన తీరు మాత్రం అంత పరిపక్వంగా లేదు. ఏదో ఒక స్టాండ్ చెప్పకుండా.. తానే కన్ ఫ్యూజ్ అయ్యి ప్రజలను ఇంకాస్త కన్ ఫ్యూజ్ చేసినట్టుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: