జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆరంభం నుంచి ఇద్దరు తండ్రులకు, ఇద్దరు కొడుకులకు చాలా కీలకంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యవహారం మొత్తాన్ని కేసీఆర్ కేటీఆర్ కే అప్పగించడంపై మొదట్లో విమర్శలు వచ్చాయి. సీనియర్, పార్టీలో ఎన్నికల స్పెషలిస్టుగా పేరున్న హరీశ్ రావును పక్కకు పెట్టి.. అంతగా అనుభవం లేని కేటీఆర్ కు గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు అప్పగించడం ఒక రకంగా సాహసమే. 

అయినా ఆ ఛాలెంజ్ ను కేటీఆర్ సమర్థవంతంగా నిర్వహించారు. సమర్థంగా నిర్వహించారని చెప్పడం కంటే.. అసలు సిసలు రాజకీయం రుచి ఏంటో చూపించారని చెప్పొచ్చు. అంతగా అనుభవం లేకపోయినా తండ్రి తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి తండ్రికి కలగా మిగిలిన గ్రేటర్ మేయర్ పీఠాన్ని ప్రేమతో కానుకగా ఇచ్చారు కేటీఆర్. 

కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు అన్నీ డివిజన్లలోనూ పర్యటనలు, సభలు నిర్వహించారు. ప్రతి డివిజన్‌ అభ్యర్థిని ఎంపికలోనూ ఆచి తూచి అడుగులేశారు. గెలుపు వ్యూహాలు రచించారు. మాదాపూర్‌ నుంచి ఇటు సామాన్యులు నివసించే బస్తీల వరకు అన్నింటిపై సమంగా దృష్టి పెట్టి.. గులాబీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో వివరించారు. 

ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పేలవ ప్రదర్శనతో పూర్తిగా బోల్తా కొట్టారు. చంద్రబాబు రెండు రోజులపాటు పూర్తిగా పర్యటించారు. ఇక లోకేశ్ చివరి వారం రోజులూ జోరుగా ఎన్నికల ప్రచారం సాగించారు. గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామేనని.. అందుకే తమకు అవకాశం ఇవ్వాలని ఎంతగా చెప్పుకున్నా జనం విశ్వసించలేదు.

ప్రత్యేకించి లోకేశ్ టీడీపీకి చెప్పుకోదగిన స్థానాలు రప్పించాలని చాలా తాపత్రయపడ్డారు. కానీ కేటీఆర్ ప్రసంగాల ముందు.. ప్రచారం ముందు లోకేశ్ పూర్తిగా తేలిపోయాడు. సరైన వాగ్దాటి, థాట్ క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజలను మెప్పించలేకపోయారు. అదే సమయంలో కేటీఆర్ పన్నిన వ్యుహాలు.. ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అందుకే కేటీఆర్ తండ్రికి ప్రేమతో గ్రేటర్ గెలుపు అందిస్తే.. లోకేశ్ మాత్రం బాబుకు బాధతో ఘోర పరాజయం అందించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: