గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పై ఇప్పటివరకూ ఉన్న ఓ అపోహను తొలగించాయి. హైదరాబాద్ లో ఆ పార్టీకి అంతగా పట్టులేదన్న మాటలకు ఇక అర్థం లేదని తేల్చి చెప్పాయి. గ్రేటర్ ఫలితాల్లో అన్ని ప్రాంతాలు, వర్గాల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటటంతో కేసీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. విజయోత్సవ ప్రెస్ మీట్లో ఆయన మహా హుషారుగా కనిపించారు. 

పనిలో పనిగా మీడియాతోనూ చనువుగా, హాస్యంగా మాట్లాడారు. కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు దాదాపు పది రోజుల ముందు జర్నలిస్టులకూ వరాలు ప్రకటించారు. ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్టులందరికీ నూటికి నూరు శాతం సర్కారు ఖర్చుతో ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతి జర్నలిస్టుకు సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని.. సమాజం కోసం పనిచేసే జర్నలిస్టుల కుటుంబాలకు ఇల్లు రూపంలో ఓ ఆస్తి మిగలాలనేది తన ఉద్దేశమని ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి ఈ హామీ పాత్రికేయుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏళ్ల తరబడి పాత్రికేయ వృత్తిలో ఉన్నా సొంతిల్లు సమకూర్చుకోలేక పోయిన ఎందరో జర్నలిస్టులకు ఇది తీయని కబురుగా మారింది. జర్నలిస్టులందరికీ ఒకేచోట ఇళ్ల నిర్మాణానికి దాదాపు వంద ఎకరాల స్థలం కేటాయిస్తామని.. పేదల కోసం కట్టే రెండు పడక గదుల ఇండ్లకు ఇచ్చే దానికి... అదనంగా నిధులు వెచ్చిస్తామని చెప్పడం వారిలో ఆశలు రేకెత్తించింది. 

ఎన్నికల ఫలితాల వేళ కేసీఆర్ ఆ మాటను మరోసారి గుర్తు చేశారు. మా జర్నలిస్టు మిత్రులు కూడా మాకే ఓటేసి ఉంటారు. వాళ్లకు ఏడాదిలోనే జర్నలిస్టు కాలనీ కట్టిస్తామని భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లూ జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామని..ఇళ్ల స్థలాలు ఇస్తామని ఊరించిన నాయకులే తప్ప నిజంగా ఇచ్చిన నాయకులు లేరు. వైఎస్ హయాంలోఇచ్చే ప్రయత్నం జరిగినా కోర్టు గొడవల వల్ల అది ఆగిపోయింది. మరి కేసీఆర్ అయినా తన మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: