గ్రేటర్ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో దాదాపు అన్ని తెలుగు చానెళ్లూ బోల్తా పడ్డాయి. ఎన్నికలకు ముందే వివిధ రకాల సర్వేలు చేసి ఫలితాలు వెల్లడించే ఛానళ్లు గ్రేటర్ ఫలితాలను చూసి బిత్తరపోయాయి. అన్ని ఛానల్లూ టీఆర్ఎస్ దే విజయమని ముందే అంచనా వేసినా ఈ స్థాయి విజయం వస్తుందని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేక పోయాయి.  

టీఆర్‌ఎస్ పార్టీకి నగరఓటర్లు ఈ స్థాయిలో పట్టం కడతారని ఏ ఛానల్ కూడా ముందుగా చెప్పలేకపోయింది. దాదాపు అన్ని సర్వేలూ టీఆర్‌ఎస్‌కే మెజార్టీ లభిస్తుందని, 75నుంచి 85 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.  ప్రభుత్వ ఆధ్వర్యలోని నిఘా వర్గాలు కూడా 85 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ.. జనం మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్‌ఎస్‌కు 99 స్థానాలు కట్టబెట్టారు. 

అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్ దే విజయమని చెప్పినా ఓటమిలోనూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు కాస్త గౌరవప్రదమైన స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఉదాహరణకు టీవీ 5 టీడీపీ - బీజేపీ కూటమికి 24 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 7 వరకూ రావచ్చని తెలిపింది. ఇక టీవీ 9 అయితే  టీడీపీ - బీజేపీ కూటమికి 34 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 10 వరకూ రావచ్చని ఊహించింది. 

ఆరా మీడియా సర్వే ఫలితాలు కూడా  టీడీపీ - బీజేపీ కూటమికి 30 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 7 వరకూ రావచ్చని తెలిపింది. కానీ అంతిమ ఫలితాలు మాత్రం వీటన్నింటికి భిన్నంగా టీఆర్ఎస్ 99 కట్టబెట్టడమే కాకుండా ప్రతిపక్షాల పరువు తీసేశాయి. టీడీపీ మరీ దారుణంగా ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ 2, బీజేపీ 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: