గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేశాం కదా... అని గర్వం తలకు ఎక్కించుకోకండి.. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి.. ప్రజలకు మేలు చేసే బ్రహ్మాండమైన అవకాశం మీకు వచ్చింది వదులుకోకండి.. ఇవీ కేసీఆర్ కొత్త కార్పొరేటర్లకు కేసీఆర్ బోధనలు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ కార్పోరేటర్లు తనను కలసిన సమయంలో కేసీఆర్ వారికి ఇలా ఉద్బోధించారు. 

కేసీఆర్ ప్రతి ఒక్క కార్పోరేటర్ నూ పేరుపేరునా పలకరించారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఆషామాషీ కాదని.. తమ బాధలు, కష్టాలు తీరతాయన్న నమ్మకంతోనే ప్రజలు పార్టీకి చరిత్రాత్మకమైన విజయం కట్టబెట్టారని కేసీఆర్ కామెంట్ చేశారు. నగరంలో కోటి మంది జనం ఉంటే.. కేవలం 150 మందికి మాత్రమే కార్పోరేటర్లుగా పనిచేసే అవకాశం వచ్చిందని... వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

హైదరాబాద్ బస్తీలు సమస్యలకు నిలయాలని.. వాటిని బస్తీల్లోని బాధలన్నింటినీ తొలిగించే బాధ్యత ఈ కొత్త ప్రజాప్రజాప్రతినిధులపైనే ఉందని కేసీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఖర్చు పెట్టే ప్రతి పైసా పేదల సంక్షేమానికే ఉపయోగపడాలని కేసీఆర్ సూచించారు.  బతికినన్నాళ్లూ ఎంత బాగా పనిచేశామన్నదే ముఖ్యమని.. కార్పోరేటర్లంతా బాగా పని చేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటారన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రయారిటీ పథకాల గురించి కూడా కేసీఆర్ కార్పొరేటర్లకు సూచించారు. పేదలకు కట్టించాలనుకున్న లక్ష రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం బాగా జరిగేలా కార్పోరేటర్లు చూడాలని చెప్పారు. హైదరాబాద్ ప్రజలంతా టీఆర్ఎస్ ను నమ్మారని.. అందుకే చంద్రబాబునాయుడు 15 సభలు పెట్టినప్పటికీ ఒకే స్థానం, తాను ఒకే సభ పెట్టినప్పటికీ 99 స్థానాలు వచ్చాయని కామెంట్ చేశారు కేసీఆర్ 



మరింత సమాచారం తెలుసుకోండి: