ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. ఇటీవలే  2వేల కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ తో అలరించింది. 539 ఎస్సై పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 

ఎస్సై పోస్టు అంటే యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. అనేక సినిమాల్లో ఎస్సైలే  హీరోలు. గబ్బర్ సింగ్ వంటి సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలాంటి తెలంగాణ యువకుల కల నెరవేరే రోజు వచ్చేసింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించే పోలీసు శాఖలో ఉద్యోగం కావాలని ఆశిస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 

ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. వచ్చే నెల 3వ తేదీని గడువుగా విధించింది. ప్రకటన జారీ చేసిన మొత్తం పోస్టుల్లో విభాగాల వారీగా తీసుకుంటే.. సివిల్ 208, ఆర్మ్ డ్‌ రిజర్వడ్ 74, సీపీఎల్‌ 2, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు-205, ప్రత్యేక రక్షక దళం 12, ఫైర్‌ సర్వీస్‌ 9, కమ్యూనికేషన్‌ 23, ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ 6 వంతున పోస్టులు ఉన్నాయి. 

ఓసీలు, బీసీలు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం ఉంటుందని స్పష్టం చేసిన బోర్డు ఈ మొత్తాన్ని ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఈ సేవ ద్వారా కాని, డెబిట్‌, క్రిడెట్‌ కార్డుల ద్వారా కూడా చెల్లించొచ్చని పేర్కొంది. ఏప్రిల్‌ 17వ తేదీన నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధిస్తేనే ఆ తరువాత నిర్వహించే శారీరక దారుడ్య పరీక్షలకు, ఫైనల్ రాత పరీక్షకు అర్హులవుతారని పోలీసు నియామక బోర్డు స్పష్టం చేసింది.

సాధారణంగా 25 సంవత్సరాలు దాటని యువతీయువకులు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు అర్హులు. కాని గత ఏడాది డిసెంబరు 12వ తేదీన వయో పరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 86వ జీవో ప్రకారం మరో మూడేళ్లు ఎక్కువ వయస్సున్న వారు కూడా సబ్‌ఇన్‌స్పెక్టర్‌  పోస్టులకు అర్హులని తెలిపింది. ఇప్పుడు 28 సంవత్సరాలు వయస్సు కలిగిన వారు కూడా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: