కేసీఆర్, చంద్రబాబు మధ్య నెలకొన్న సఖ్యత కారణంగా కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంది. ఎలాంటి వివాదాలు లేకుండా పాలన సాఫీగా సాగుతోంది. రాష్ట్రం విడిపోయిన మొదట్లో ప్రతి విషయంలోనూ దెబ్బలాడుకున్న రాష్ట్రాలు ఇప్పుడు పూర్తిగా సంయమనం పాటిస్తున్నాయి. చర్చించుకుని వివాదాలు పరిష్కరించుకుంటున్నాయి. 

మళ్లీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ తలెత్తుతోంది. ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి ఆదేశాలు ఇవ్వడాన్ని తెలంగాణ నీటి పారుదల శాఖ తప్పుబడుతోంది. దీనిపై తమ అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి,  కేంద్ర జలసంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేసేసింది. 

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ వాదన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చెప్పినట్టు.. ఏ కొత్త ప్రాజెక్టునైనా కృష్ణా యాజమాన్య బోర్డు, అత్యున్నత మండలి అనుమతులు పొందాలి. కానీ ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని పట్టించుకోకుండా ఎలాంటి అనుమతులు లేకుండా  ప్రాజెక్టు నివేదిక తయారీకి జీవో జారీ చేసిందని తెలంగాణ సర్కారు విమర్శిస్తోంది. 

ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువ పనులకు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం కొనసాగించడాన్ని నిరోధించాలని తెలంగాణ కేంద్రానికి లేఖల ద్వారా  విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. అటు కర్నాటకపైనా తెలంగాణ ఫిర్యాదు చేసింది. కర్నాటక ప్రభుత్వం జూరాల ఎగువున రాయచూర్ జిల్లా గిరిజాపూర్ గ్రామం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణానదిపైన బ్యారేజీ నిర్మాణానికి పూనుకుందని తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: