కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆయన తన ఇంటి తలుపులు వేసుకుని వైద్య పరీక్షలను నిరాకరిస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. ముద్రగడ శనివారం ఉదయం పూట మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించలేదు.

ఆయన వైద్య పరీక్షలు నిరాకరిస్తుండటంతో మొదట ఆయనకు నచ్చజెప్పేందుకు పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు వచ్చారు. ఆయన ఎంత చెప్పినా ముద్రగడ వైద్యపరీక్షలకు అంగీకరించలేదు. తన ఆరోగ్యం బాగానే ఉందని..తనకు పరీక్షలు అవసరం లేదని ముద్రగడ అంటున్నారు. దీంతో ఆర్డీఓ సమాచారాన్ని జాయింట్ కలెక్టర్ కు నివేదించారు. 

రాత్రి 9 దాటిన తర్వాత జిల్లా సంయుక్త కలెక్టర్ సత్యనారాయణ అక్కడకు వచ్చారు. ఆయన సమయంలో ముద్రగడ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అయితే జేసీ వచ్చినా సరే ముద్రగడ మాత్రం తలుపులు తీయలేదు. ఆయనతో మాట్లాడలేదు. దీంతో ఆయన చేసేదేమీ లేక.. ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేస్తామని చెప్పి వెళ్లిపోయారు. 

ముద్రగడ గతంలోనూ ఇలాంటి దీక్షలు కొన్నిసార్లు చేశారు. గతంలోనూ ఇలా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నసందర్భాలు ఉన్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబే వచ్చినా తలుపులు తీయకపోవడం విశేషం. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతో శనివారం రాత్రే ముద్రగడ దీక్షను భగ్నం చేస్తారని అనుకున్నా.. ఆ పని జరగలేదు. 

మరోవైపు ముద్రగడ ఇంటికి వచ్చే నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ముద్రగడను పరామర్శించేందుకు వచ్చిన  సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ లను కూడా పోలీసులు అడ్డుకున్నారు. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగి ముద్రగడ ఇంటి వద్దకు చేరుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: