గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణులను ఆనందడోలికల్లో ముంచుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ రానంత ఘన విజయం సొంతమయ్యేసరికి ఊరూ వాడా తేడాలేకుండా టీఆర్ఎస్ నేతలంతా పండుగ చేసుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అదిరిపోయే విజయాలనే అందుకుంది. 

ఐతే.. ఈ వరస విజయాలు టీఆర్ఎస్ నేతలలో విపరీతమై ఆత్మవిశ్వాసం నింపుతున్నట్టున్నాయి. ఇక కేసీఆర్ ను ఆకాశానికెత్తేసే నేతలు అంతే లేదు. తమ నాయకుడికి తిరుగులేదని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రే కాదు.. దేశానికే ప్రధాని కావాలని ఆశాభావం ప్రకటిస్తున్నారు. 

హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. కేసీఆర్ ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హుడు అని ప్రకటించారు. ఇప్పటికే  బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న ఆయన బంగారు భారత దేశానికి పనిచేస్తారని గంగుల అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. 

కార్యకర్తలకు, నాయకులకు కేసీఆర్ ను ప్రధానిగా చూడాలని కోరిక ఉంటే ఉండొచ్చు.. కానీ వాస్తవంగా అది సాధ్యపడే పరిస్థితి ఉందా.. తెలంగాణలో మొత్తం ఉన్న ఎంపీ సీట్లే కేవలం 17. తెలంగాణ మొత్తం కేసీఆర్ కు ఏకపక్షంగా ఓటేసినా.. 17 కంటే సీట్లు కంటే ఎక్కువ వచ్చే ఛాన్సు లేదు. మరి అలాంటప్పుడు కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది..?



మరింత సమాచారం తెలుసుకోండి: