కేసీఆర్.. చరిత్ర సృష్టించిన, సృష్టిస్తున్న నాయకుడు.. తెలంగాణ రాష్టం ఏర్పాటనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు. ఒక నాయకుడిగా ఆయన ఇప్పటికే చరిత్ర పుటలకు ఎక్కారు. ఇకపై ఆయన ఎంత చేసినా బోనస్ కిందే లెక్క. మరి గులాబీ పార్టీని కేసీఆర్ తర్వాత నడిపించేంది ఎవరు.. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కేసీఆర్ తర్వాత దక్కేదెవరికి.?

ఇవి సహజంగానే జనంలో రేకెత్తే ఆసక్తికర అనుమానాలు. వీటికి కనిపిస్తున్న సమాధానాలు ప్రస్తుతానికి రెండే. అవి కేసీఆర్ కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు. నిన్న మొన్నటి వరకూ సమఉజ్జీలుగా కనిపించిన ఈ ఇద్దరు యువ నాయకుల పరిస్థితిలో ఇప్పుడు గణనీయమైన మార్పుకనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. 

ఇక ఇప్పుడు తన వారసుడిగా కేటీఆర్ ను ప్రకటించినా పార్టీలో పెద్దగా వ్యతిరేకత ఏర్పడని పరిస్తితి నెలకొంది. అయితే దీనిపై కేటీఆర్ మనసులో ఏముంది.. ఈ విషయం కనుక్కునే ప్రయత్నం మీడియా చేసింది. అయితే ఈ విషయంలో కేటీఆర్ చాలా ఆచి తూచి స్పందించారు. కేసీఆర్‌ రాజకీయ వారసత్వంపై ఇప్పుడు చర్చ అనవసరమంటూ కామెంట్ చేశారు. 

కేసీఆర్ వయస్సు ఇప్పుడు కేవలం 62 ఏళ్లు మాత్రమే. రాజకీయాల్లో ఇది పెద్ద వయస్సేమీ కాదు.. కేసీఆరే మరో 20 ఏళ్లపాటు పార్టీ పెద్దగా బాధ్యతలు నిర్వహిస్తారన్న నమ్మకం మాకుంది. అందువల్ల ఇప్పడే ఈ విషయంపై మాట్లాడటం తొందరపాటే అవుతుంది అంటూ కేటీఆర్ స్పందించారు. తాను గతంలోనూ, ఇప్పుడూ మంత్రిగానే ఉన్నానని.. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని కేటీఆర్ చెప్పారు. 

మరి గ్రేటర్ బాధ్యతలు మీకే ఎందుకు అప్పగించారన్న ప్రశ్నకు కేటీఆర్ సరైన సమాధానమే ఇచ్చారు.  తనకు ఆంగ్లం, ఉర్దూ బాగా వచ్చు. గతంలో ఐటీలోనూ పనిచేశాను. ఈ బ్యాక్ గ్రౌండ్ వల్ల నేను హైదరాబాద్ కు సూటవుతానని కేసీఆర్ భావించారు. అలా అడ్వాంటేజ్ తీసుకోవడం కూడా తప్పుకాదు కదా.. అన్నారు. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వానికి సార్వజనీన ఆమోదం లభించిందని.. ఆయన నాయకత్వంలో ముందుకెళ్తామన్నారు కేటీఆర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: